మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు అమలు – ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి- ఘనంగా ప్రపంచ మత్స్యకార దినోత్సవం నిర్వహణ

మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత,రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ…. మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారి ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా, వారు ఆర్ధికంగా అభివృద్ధి చెందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రపంచ మత్స్య దినోత్సవం 2024 సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలోని కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయుటకు రూ.392.45 కోట్లుతో ప్రణాళికలు సిద్దం చేయడం జరిగిందన్నారు. ఈ ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు వలన ఈ ప్రాంత మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందడం జరుగుతుందన్నారు. చేపల ఉత్పత్తిలో మొత్తం దేశంలోనే 29.1 శాతం వాటాతో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ముందు ఉందన్నారు. ఇతర రాష్ట్రాలకు మత్స్యకారుల వలసలను నివారించేందుకు అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఒంగోలు నగరంలో మత్స్యకార భవనం నకు గతంలో 25 లక్షల రూపాయలు ఎంపి గ్రాంటు కింద ఇవ్వడం జరిగిందని, భవన నిర్మాణం చేపట్టనందున ఆ నిధులు అట్లే వున్నాయని, భవన నిర్మాణం చేపట్టితే ఆ నిధులను రెన్యువల్ చేసి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ….ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలుపారు. ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల సమయంలో పిలిచిన వెంటనే 35 బొట్లతో, 75 మంది మత్స్యకారులు విజయవాడకు వెళ్లి వారం రోజుల పాటు వరద సహాయక చర్యల్లో పాల్గొనటం జరిగిందని, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారికి కృతజ్ఞతలు తెలియచేశారు. తమిళనాడు రాష్ట్రం నుండి వస్తున్న సోనా బోట్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగిందని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. తుఫాన్ మరియు వరదల సమయంలో మత్స్యకారులను ఏవిధంగా ఆదుకోవాలన్న విషయంపై చర్చిండం జరుగుచున్నదన్నారు. స్వర్ణాంధ్ర@2047 లక్షసాధనలో ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ రంగాలను వృద్ధి ఇంజిన్లలో ఒకటిగా గుర్తించబడిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా, వారు ఆర్ధికంగా వృద్ది చెందేలా జిల్లా యంత్రాంగం అన్నీ చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. కొత్తపట్నం, పాకాల బీచ్ లను అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మత్స్యకార కుటుంబాలు సద్వినియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ది సాధించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మత్స్యకారులకు సూచించారు.

రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ మాట్లాడుతూ … ప్రపంచ జనాభాకు మత్స్య ఆహారాన్ని అందిస్తున్న మత్స్యకారుల అభివృద్దికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల అభివృద్దికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుచున్నదన్నారు. బీచ్ క్యారిడార్ కింద బీచ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. బీచ్ ల అభివృద్ధి వలన ఆ ప్రాంత మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందడం జరుగుతుందని తెలిపారు.

ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ…. నేటి పరిస్థితుల్లో రైతులు ఎ విధంగా నష్టపోతున్నారో, అదే విధంగా ఆక్వా రైతులు కూడా నష్టపోవడం జరుగుచున్నారని, వీరిని అన్నీ విధాల ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వారికీ అవసరమైన బోట్లు, ఇంజన్లు, వలలు తదితర సామాగ్రి సబ్సిడీతో అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ…. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ప్రస్తావించారు.

తొలుత జిల్లా మత్స్య శాఖాధికారి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి మత్స్య శాఖ తరపున మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్దికి చేపడుతున్న కార్యక్రమాలను, మత్స్యకారులు తీసుకువచ్చిన పలు సమస్యలను వివరించారు.

ఇటీవల విజయవాడలో వచ్చిన వరదల సమయంలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పలువురు మత్స్యకారులను ఈ సందర్భంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *