ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది శుక్రవారం పలు పాఠశాలు/కళాశాలల్లోని విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్, లైంగిక వేధింపులు, మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనార్ధాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలపై మరియు డయల్ 100/112 సేవల గురించి అవగాహన కల్పించారు.
ముఖ్యంగా విద్యార్థినులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ మధ్య తేడా తెలుసుకోవడం, అనుమానాస్పద వ్యక్తులు, వారి వ్యవహారశైలిని గుర్తించడం మరియు స్వీయ రక్షణ, మహిళలపై జరుగుతున్న నేరాలు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో జరిగే మోసలపట్ల మరియు చట్టాలపై కూడా అవగాహన కల్పించారు. సెల్ ఫోన్లకు, ఆకర్షణ ప్రేమ ప్రభావాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. పిల్లలు స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా వినియోగిస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరణ ఇచ్చారు. ఫేక్ ఎస్ఎంఎస్ లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు నుండి అని ఫోన్లు, వాట్సప్‌ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, మీ కేవైసీ పెండింగ్ అని జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అనగా పోలీస్, సిబిఐ, వివిధ ఉన్నత శాఖల అధికారులంటూ ఫోన్ చేసి డబ్బులు వసూలు చేయడం వంటి ఇతర సైబర్ మోసాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఒకవేళ సైబర్ క్రైమ్ లో బాధితులయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపడం ద్వారా కొంతమేర నష్టపోయిన డబ్బును తిరిగి పొందచ్చని తెలపడం జరిగింది.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలు, విద్య మరియు భవిష్యత్తు గురించి వివరించారు. వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కావున మాదకద్రవ్యాలు మీ దరి చేరకుండా స్మార్ట్ గా వ్యవరించాలన్నారు. గంజాయి లాంటి డ్రగ్స్ రవాణా చేసినా, అమ్మినా, సేవించినా కేసులు నమోదు చేయబడతాయని, ఒకసారి డ్రగ్ కేసుల్లో పట్టుబడి పోలీసు రికార్డ్స్ లో పేరు నమోదయ్యితే భవిష్యత్తులో ఉద్యోగాలు పొందలేరని, విద్యార్థులు క్రమ శిక్షణతో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. ప్రతిరోజు జరుగుతున్న యాక్సిడెంట్లు గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నియమాలు, ఇన్సూరెన్స్‌లు, రహదారులపై హెల్మెట్ మరియు సీటు బెల్ట్ ధరించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం వంటి అనేక ముఖ్యమైన రోడ్డు భద్రతా మరియు ట్రాఫిక్ నియమాలు గురించి విద్యార్థులకు వివరించారు.
ఏదైనా అత్యవసర సమయంలో పోలీసు వారి సహాయం పొందాలంటే అటువంటి సమయంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ కు లేదా డయల్ – 100/112 కు కాల్ చేయడం ద్వారా సత్వర సహాయం అందుతుందని తెలిపారు.





