కర్నూలు పట్టణం వెంకటరమణ కాలనిలోని ఏపీటీడీసీకి సంబంధించిన హరిత పున్నమి హోటల్లో లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శనివారం ఏపి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డా. నూకసాని బాలాజీ సమీక్షించారు.. ఈ సందర్భంగా డాక్టర్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ….. పున్నమి రెస్టారెంట్ దాదాపు 4 ఎకరాల 30 సెంట్లలో నిర్మించబడిందనీ, 80 సెంట్లలో నిల్వ ఉన్న డంప్ యార్డను వీలైనంత త్వరగా తొలిగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే పున్నమి గెస్ట్ హౌస్ లో వున్న 26 గదుల్లో 16 గదుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నవని, వీటిని వీలైనంత త్వరగా పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కర్నూలు సమీపంలోని గార్గేయపురం చెరువు నగర వనం దగ్గర బోటింగ్ నిర్వహణ తిరిగి పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని టూరిజం అధికారులను ఆదేశించారు. అనంతరం ఓర్వకల్ రాక్ గార్డెన్ ని సందర్శించారు. పరిసరాలన్నీ పచ్చదనంతో పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉండాలని, రూములు నీట్ గా ఉంచాలని, పర్యాటకులతో మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. పనుల నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడిన ఉపేక్షించేది లేదని అవకతవకలకు పాల్పడినా నాణ్యతా లోపాలున్నా…పనులను వెంటనే ఆపి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయించి బిల్లులు నిర్దాక్షిణ్యంగా నిలిపివేస్తామని, ఈ విషయంలో ఎవరు చెప్పినా వినేది లేదని ఖరాఖండిగా చెప్పారు. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు వర్తిస్తుందని, అవకతవకలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాబోయే రెండు, మూడు నెలల్లో అన్ని యూనిట్లు, అన్ని సెక్టార్లలోని పనులు నాణ్యతతో పూర్తి చేసి ఏపీ టూరిజం వసతుల్ని రాష్ట్రవ్యాప్తంగా పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏ పి టి డి సి బోర్డ్ డైరెక్టర్ ముంతాజ్ బేగం, మాధవ నాయుడు,టీడీపీ బెస్త సాధికార కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.జి. వెంకటేష్, సుల్తాన్, ఏ పి టి డి సి అధికారులు, స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు.







