హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పోలీస్ కానిస్టేబుల్ భాగ్యరాజు(PC.1074) సతీమణి ఝాన్సీ కి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్ఫేర్ నుండి ఎమర్జెన్సీ కింద లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
దర్శి సర్కిల్ ఆఫీస్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ జి. భాగ్యరాజు తేదీ 22.11.2024 న తన ఇంట్లో ప్రెజర్ కుక్కర్ మూత తీస్తుండగా ప్రమాదవశాత్తు కుక్కర్ పేలి, అందులో ఉన్న పదార్థం తన ముఖము మరియు ఛాతీపై పడి చర్మం కాలిపోగా, అలాగే శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు భాగ్యరాజును చికిత్స నిమిత్తం ఒంగోలు ఉషా సర్జరీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెంటనే స్పందించి వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుండి ఎమర్జెన్సీగా లక్ష రూపాయలు మంజూరు చేశారు.
ఈ సంధర్భంగా చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య స్థితుగతులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, వైద్య చికిత్సలు, ఇతర ఏ అవసరం ఉన్నా, ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా ఫోన్ ద్వారా తెలియజేయవచ్చునన్నారు. ఎప్పటికప్పుడు కానిస్టేబుల్ ఆరోగ్య స్థితిగతులను గూర్చి తనకు తెలియజేయాలని, మెరుగైన వైద్యం అందించి క్షేమంగా తిరిగి కోలుకునేంత వరకు పోలీస్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని ఎస్పీ గారు ఆదేశించారు. భాగ్యరాజు ఆరోగ్య స్థితిగతులను తెలుసుకోవడమే కాక, ఆర్థిక సాయం అందించడంపై ఎస్పీ ఏఆర్ దామోదర్ కి కానిస్టేబుల్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
