భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీస్ అధికారులు రాజ్యాంగ నిర్మాత Dr.B.R.అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి పుష్పాలతో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ… భారతదేశంలో విభిన్న వర్గాలు, జాతులు, కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ ఒక్కటిగా ఉండేలా చేసే ఘనత మన రాజ్యాంగానిదేనని, భారతదేశాన్నీ అభివృద్ధి మరియు శాంతి వైపు నడిపించుటకు అంబేద్కర్ గారు అనేక దేశాల రాజ్యాంగాలను స్టడీ చేసి గొప్ప రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన నవంబర్ 26న ప్రతి సంవత్సరం రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామని, భారత రాజ్యాంగ విశిష్టత, ప్రాధాన్యతను తెలుసుకునేందుకు ఇది ప్రత్యేకమైన రోజని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అనుభవిస్తూనే, బాధ్యతలను కూడా నెరవేర్చాల్సిన అవసరం మనందరిపై ఉందని గుర్తించాలని, బంగారు భారత్ నిర్మించుటకు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను పాటించాలని సూచించారు.
భారత రాజ్యాంగంలో ఉద్యోగులకు కార్యనిర్వహణలో కీలకమైన
బాధ్యత ఉందని, రాజ్యాంగ పరిరక్షణలో పోలీస్ శాఖ పాత్ర ముఖ్యమైనదని, కావున పోలీసులు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, పౌరుల ప్రాథమిక, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు అందించాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని, విధులు రాజ్యాంగ బద్ధంగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి పోలీసులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ చంద్రశేఖర్, DPO ఏవో రామ్మోహనరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఐటీ కోర్ సీఐ వి.సూర్యనారాయణ, ఆర్ఐలు రమేష్ కృష్ణన్, సీతారామిరెడ్డి, ఆర్ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.




