“మీకోసం” అర్జీలు పరిష్కారమవుతున్న తీరుకు సంబంధిత సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లే బాధ్యులు – జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా

తమ డివిజన్ లోని “మీకోసం” అర్జీలు పరిష్కారమవుతున్న తీరుకు సంబంధిత సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లే బాధ్యులని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. అర్జీలను క్రిందిస్థాయి అధికారులు పరిష్కరిస్తున్న విధానాన్ని ప్రతిరోజూ పర్యవేక్షించాలని వారిని ఆమె ఆదేశించారు. మంగళవారం ప్రకాశం భవనం నుంచి సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు, మండలస్థాయి అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మీకోసం అర్జీల పరిష్కారము, కోర్టు కేసులు, పొలాలకు నీటిపన్ను యాప్ నిర్వహణ, తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణతో కలిసి ఆమె సమీక్షించారు. ఆయా అంశాలలోని పురోగతిని పరిశీలించి కలెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మీకోసం అర్జీల పరిష్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. గ్రామస్థాయి సిబ్బంది ఇచ్చిన నివేదికలను తహశీల్దార్లు, మండలస్థాయి నుంచి వచ్చిన నివేదికలను సబ్ కలెక్టర్, ఆర్.డి.ఓ.లు క్షుణ్ణంగా పరిశీలించకుండా యధాతధంగా ఆమోదించరాదని ఆమె చెప్పారు. మీకోసం అర్జీలలో దాదాపు 90 శాతం రెవెన్యూ సమస్యలే ఉన్నందున ఆయా అర్జీలలో ప్రస్తావించిన సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని పరిశీలించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్జీలను నిర్దిష్ట గడువులోపే పరిష్కరించి తగిన ఎండార్స్మెంట్ ఇవ్వాలని చెప్పారు. గడువు వరకు వేచిచూడకుండా అర్జీ వచ్చిన రెండు రోజులలోనే వాటిని పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.

కోర్టు కేసులకు సంబంధించిన వకాలత్, కౌంటర్, రివ్యూ పిటిషన్లను సకాలంలో దాఖలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా విషయాలలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలస్థాయి అధికారులు చేసిన తప్పులకు తాను కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తున్నదని ఆమె అన్నారు.

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన గ్రామసభలలో సర్వే, రెవెన్యూ అంశాలపై వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని, వాటికి సంబంధించిన డేటా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ఈ అర్జీలను పరిష్కరించిన వివరాలను సర్వే శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలా లేదా “మీకోసం” సైట్లోనా అనే విషయంపై త్వరలో స్పష్టత ఇస్తామని తెలిపారు. పొలాలకు వాటర్ టాక్స్ మాడ్యూల్ నిర్వహణపైనా అవగాహన
కలిగిఉండాలని ఆయన చెప్పారు. సాగునీటి సంఘాలకు ఎన్నికల నేపధ్యంలో స్థానిక పరిస్థితులను ఏవిధంగా పరిగణనలోకి తీసుకోవాలి, ఆ వివరాలను ఏ విధంగా అప్లోడ్ చేయాలి తదితర అంశాలను ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్ లోకేశ్వరరావు, సర్వే శాఖ సహాయ సంచాలకులు గౌస్ బాషా, కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *