ప్రకాశం జిల్లా, పిసి పల్లి మండలం, దివాకరపల్లె గ్రామం వద్ద ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సీబీజీ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమానికి ఈ నెల 2న గౌరవ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ మరియు తదితరులు విచ్చేయుచున్న సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులు, సిబ్బందితో సభా వేదిక వద్ద సమావేశాన్ని నిర్వహించారు. బందోబస్తు విధులపై దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసింతవరకు బందోబస్తు విధులు నిర్వర్తించే అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్పీ బందోబస్తును గూర్చి మాట్లాడుతూ …బందోబస్తు విధులలో పాల్గొనే పోలీస్ అధికారులు, సిబ్బంది వారికి కేటాయించిన స్థలానికి, నిర్దేశించిన సమయానికి విధులకు హాజరై ఉండాలని,హెలిప్యాడ్, వి.ఐ.పి రూట్ బందోబస్త్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాలలో భద్రతాపరమైన అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు తెలియచేసారు. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది అందరూ తమకు కేటాయించిన పాయింట్ల వద్ద అప్రమత్తంగా మెలగాలని సూచించారు. బయట నుండి వచ్చే వాహనాలు కేటాయించిన స్థలాలలోనే పార్కింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశించారు.
ముందుగా పిసిపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ సందర్శించి, స్టేషన్ స్థితిగతులు, స్టేషన్ ఆవరణాన్ని,గదులను, మహిళా సహాయక కేంద్రం మరియు పరిసరాలను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రికార్డులు మరియు పలు రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు. మహిళల భద్రత విషయంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, మహిళలు/పిల్లలపై జరిగే అకృత్యాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా బాధితుల పట్ల తక్షణమే స్పందించాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ వెంట ఏ ఎస్ పి (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, దర్శి డిఎస్పీ లక్ష్మి నారాయణ, మార్కాపురం డిఎస్పీ నాగరాజు, కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, కనిగిరి సీఐ ఖాజావలి,ఆర్ఐ రమణారెడ్డి, పిసిపల్లి ఎస్సై కోటయ్య, కనిగిరి ఎస్సై శ్రీరామ్ మరియు సిబ్బంది ఉన్నారు.


