వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా 3600 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ మరియు ప్రదర్శన ఒంగోలు నగరంలో అత్యంత శోభాయమానంగా జరిగింది. స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన పతాక ప్రదర్శన కార్యక్రమం స్థానిక అద్దంకి బస్టాండ్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వరకు సాగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ, ప్రకాశం జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఏ ఆర్ దామోదర్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధ సూర్యప్రకాష్ రావు నేతృత్వంలో జాతీయ పతాక ప్రదర్శన సాగింది. ప్రారంభ సూచికగా ముఖ్య అతిథులు మువ్వన్నెల బెలూన్లను ఆకాశంలోకి ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాలేజీ విద్యార్థులు స్కూలు విద్యార్థులు పాల్గొని భారత్ మాతాకీ జై వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.





