బేగంపేట జులై 23(జే ఎస్ డి ఎం న్యూస్) :
పార్క్ ల అభివృద్ధి లో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములు కావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. బుధవారం సనత్ నగర్ లోని మూడు పార్క్ లలో అసెంబ్లీ నియోజక వర్గ అభివృద్ధి నిధులు 20 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పవర్ బోర్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోనే అత్యధిక పార్క్ లు ఉన్న డివిజన్ గా సనత్ నగర్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. పార్క్ లను అభివృద్ధి చేయడం ద్వారా కాలనీలలోని ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం లో గడిపే వెసులుబాటు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తుల పై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పార్క్ లలో పాత్ వే ల నిర్మాణం, లైట్ ల ఏర్పాటు, ఓపెన్ జిమ్ ల ఏర్పాటు వంటివి చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పార్క్ లలో మొక్కల పెంపకానికి అవసరమైన నీటి కోసమే నూతనంగా బోర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్థానికంగా ఉండే ప్రజలు అధికారులకు పార్క్ ల అభివృద్ధి, నిర్వహణ, పారిశుభ్రత విషయం లో సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రాగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, డి సి జయంత్, ఈ ఈ వెంకటేశ్వరరావు, వాటర్ వర్క్స్ జీ ఎం ప్రభాకర్ రావు, హార్టికల్చర్ అధికారి జ్యోత్స్న, డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సురేష్ గౌడ్, ఖలీల్, ప్రవీణ్ రెడ్డి, రాజేష్ ముదిరాజ్, కొలన్ భూపాల్ రెడ్డి, కరీం లాలా, సమి ఉల్లా తదితరులు ఉన్నారు.




