సినీ సాహిత్యంలోనైనా సామాజిక విప్లవ సాహిత్యంలోనైనా శ్రమ, ప్రకృతి, స్త్రీ, మానవ సంబంధాలే …నా కవిత స్ఫూర్తి అని సినీ రచయిత సుద్దాల అశోక్ తేజ పేర్కొన్నారు. ఔచిత్యం పాటించే కవిత్వం ఏదైనా ప్రేక్షకులను పాఠకులను రంజింప చేస్తుందని ప్రముఖ సాహితీవేత్త సినీ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. గురువారం సాయంత్రం బాపట్ల జిల్లా చీరాల మండలం తులసి నగరంలో వివేకా సర్వీసు సొసైటీ, ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన నెల నెల నందివర్ధనం నూట మూడవ సాహితీ సభలో ఆయన పాల్గొన్నారు. నా కవిత్వ తత్వం, నిర్మాణం, గమనం, గమ్యం అను అంశంపై సుద్దాల అశోక్ తేజ సుదీర్ఘంగా ప్రసంగించిన తీరు సబికులను మంత్రముగ్ధులను చేసింది. పాట, సంగీతం, సాహిత్యం తన కుటుంబం నుంచి వారసత్వంగా తనకు సంక్రమించాయని తండ్రి హనుమంతు నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకోవడం జరిగిందన్నారు. ఎలాంటి సాహిత్యానికైనా, ఎంతటి మహా తత్వానికైనా, గొప్ప కవిత్వానికైనా ఔచిత్యభంగం కలగకూడదని తాను విశ్వసిస్తానన్నారు. కవిత్వానికి పునాదిగా ఔచిత్యాన్ని క్రమం తప్పకుండా పాటించడం అనేది తనకు అలవాటు అయి, అదే పరిపాటిగా మారిందని స్పష్టం చేశారు. తన సాహిత్యం యావత్తూ ప్రకృతి … శ్రమ … స్త్రీ … మానవ సంబంధాలు అనే అంశాల మీద కొనసాగిందన్నారు. ఎంతో విస్తృతంగా చర్చను కొనసాగిస్తూ, ప్రజలను చైతన్యం చేసే విధంగా ఈ నాలుగు అంశాల మీద తన సాహిత్యం మనుగడ సాగించిందన్నారు. సాహిత్యం ప్రజల చెవిని, హృదయాన్ని రెండింటినీ తాకే విధంగా మంచి ఎత్తుగడతో ముందుకు సాగాలని తన తండ్రి ఇచ్చిన మార్గదర్శకత్వంలో తన కవిత్వ ప్రస్థానం కొనసాగిందన్నారు.నేలమ్మ నేలమ్మ నేలమ్మా
నీకు వేల వేల వందనాలమ్మ.. అంటూ ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపే కవిత్వం, ప్రతి స్త్రీలో అమ్మను, సోదరిని చూడాలనే సందేశంతో స్త్రీ ఔన్నతాన్ని తెలియజేసే కవిత్వం, శ్రమ శక్తి గొప్పతనాన్ని తెలియజేసే కవిత్వం, మానవ జీవన సౌందరాన్ని , మానవ సంబంధాల గొప్పతనాన్ని, ప్రత్యేకతను తెలియజేసే కవిత్వం తన నుంచి ప్రసవించి, ప్రసరించిందన్నారు. ఏదైనా ఒక రచన పాండిత్యాన్ని ప్రదర్శించడం కన్నా , సమస్య పరిష్కారాన్ని జన పదాలతో సమాజానికి అందించడమే రచయిత బాధ్యత కావాలని ఆయన తెలిపారు. సుమారు ఐదు వేలకు పైగా సినీ గీతాలు వ్రాయడం సమాజం నాకిచ్చిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా “తెలుగు సినీ గేయ సాహిత్యం” అనే శీర్షికతో నెల నెల నందివర్ధనం కార్యక్రమాల ప్రసంగ పాఠాల సంచికను డా. సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. వివేక సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఎన్ వి నాగరాజు, కార్యదర్శి అంబటి మురళీ కృష్ణ, ధృతి అధ్యక్షులు కళ్ళం అన్న హరినాధ రెడ్డి, కార్యదర్శి చాపల సుబ్రహ్మణ్యం, విద్యార్థినీవిద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

