ముఖ్యమంత్రి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి -రాష్ట్ర దేవాదాయ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి

 పేదరికం లేని సమాజాన్ని రూపొందించటమే లక్ష్యంగా పీ – 4 కార్యక్రమాన్ని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
ప్రత్యేకంగా ప్రవేశపెట్టారని రాష్ట్ర దేవాదాయ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పై శనివారం మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాలులో జిల్లా అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా,
పలువురు శాసనసభ్యులు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో
పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ …స్వర్ణాంధ్ర – 2047 కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విజన్ యాక్షన్ ప్లాన్ లో పది సూత్రాలు ఉన్నాయన్నారు. వీటిలో పేదరిక నిర్మూలన కూడా ఒకటి అని చెప్పారు. పీ – 4 ద్వారా పేదరికం లేని సమాజం ఆవిష్కృతం కావాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా సమాజంలో అభివృద్ధిపరంగా  పైస్థాయిలో ఉన్న 10 శాతం ప్రజలు, కిందిస్థాయిలో పేదరికంతో బాధపడుతున్న 20% కుటుంబాలకు పలు రకాలుగా చేయూతనిచ్చి పేదరికాన్ని ఆయా కుటుంబాలు అధిగమించేలా చూడడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. ఈ దిశగా చేయూత అవసరమైన కుటుంబాలు ప్రకాశం జిల్లాలో 74 వేలకు పైగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వీటిని ‘ బంగారు కుటుంబాలు’గా పేర్కొంటున్నట్లు చెప్పారు. ఆయా కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచే వారిని ‘ మార్గదర్శకులు ‘ అని పేర్కొంటున్నట్లు తెలిపారు. మార్గదర్శకులు ఆర్థిక సహాయమే చేయాలన్నది ఈ పథకం ఉద్దేశం కాదని, బంగారు కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా వివిధ రకాలుగా ‘ మార్గదర్శకం ‘ చేయాల్సి ఉంటుందన్నారు. ఆయా అవసరాలను, కుటుంబాలను సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ లో ఈ వివరాలను
పొందుపరిచినట్లు చెప్పారు. ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇతర సహాయం ఏమైనా బంగారు కుటుంబాలకు అవసరమని గుర్తిస్తే, ఆ దిశగా సహాయం చేసేందుకు ‘ మార్గదర్శకులు ‘ ముందుకు వచ్చేలా చూడాలని మంత్రి కోరారు. పేద కుటుంబాల్లోని పిల్లలను చదివించడం, ఆయా కుటుంబాలకు అవసరమైన జీవనోపాధి కల్పనకు శక్తి మేరకు కృషి చేయటం,  దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నావారికి వైద్యం కోసం చేయూతనివ్వటం, అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి లభించాల్సిన సంక్షేమ పథకాల ప్రయోజనం ఆయా కుటుంబాలకు దక్కనప్పుడు ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లి లబ్ది కలిగేలా చూడటం వంటి సహాయం చేయవచ్చని చెప్పారు. బంగారు కుటుంబాలకు ఉన్న ఆర్థికేతర అవసరాలను తీర్చుకోవటముపై అవగాహన కల్పించవచ్చన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆశయ సాధనకు అనుగుణంగా సహాయం చేసే శక్తి ఉన్న వారందరూ తమ వంతు బాధ్యత తీసుకునేలా చూడాలని పిలుపునిచ్చారు.
మంత్రి స్వామి మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం సాధికారత సాధించేలా అవసరమైన మార్గదర్శకులను గుర్తించాలని ఉద్యోగులకు చెప్పారు. 2047 నాటికి రాష్ట్రంలో పేదరికం ఉండకూడదు అన్నది ముఖ్యమంత్రి ఆలోచనగా తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానం, ఆశయ
స్పూర్తితో ఉద్యోగులు పనిచేయాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఎంపీ మాట్లాడుతూ మెరుగైన సమాజం కోసం ముఖ్యమంత్రి వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. పి – 4
పథకంలో మార్గదర్శకులను ప్రోత్సహించాలని సూచించారు. నిబంధన మేరకు సి.ఎస్.ఆర్. ఫండ్స్ నుంచి కూడా మార్గదర్శకులు ముందుకు వచ్చేలా చూడాలన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 74,911 బంగారు కుటుంబాలను గుర్తించామన్నారు. ఇప్పటివరకు 5434 మార్గదర్శకులు ముందుకు వచ్చి 31,367 కుటుంబాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నాటికి అన్ని కుటుంబాలను దత్తత తీసుకునేలా మార్గదర్శకులను గుర్తించడంపై దృష్టి పెట్టామన్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశ్రమలు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు విద్యాసంస్థలు, కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పి-4 పథకం యొక్క లక్ష్యాలను, ఉద్దేశాన్ని స్వయంగా తాను వివరించానన్నారు.
ఒంగోలు, సంతనూతలపాడు, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, బి ఎన్ విజయ్ కుమార్, ముత్తుమల అశోక్ రెడ్డి, కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జిలు ఎరిక్షన్ బాబు, గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పీ – 4 కార్యక్రమాన్ని విజయవంతం చేసి, పేదరికం లేని సమాజ ఆవిష్కరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. మానవసేవే మాధవ సేవగా భావించి ప్రజాప్రతినిధలుగా తాము కూడా ఆదర్శవంతమైన ‘ మార్గదర్శకులు’గా నిలుస్తామని చెప్పారు.
            ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, అన్ని నియోజకవర్గాల పీ – 4 స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *