ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు మరియు చీమకుర్తి పరిసర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో డాగ్ స్క్వాడ్ (పేలుడు పదార్థాలు గుర్తించే జాగిలాలు చీత, మాగ్గీ) మరియు బాంబ్ స్క్వాడ్ బృందాలతో పాటు స్థానిక ఒంగోలు, చీమకుర్తి పోలీస్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ పార్సిల్ పాయింట్, ఓల్డ్ మార్కెట్ సెంటర్, కర్నూల్ రోడ్, నెల్లూరు బస్టాండ్ పరిసరాల్లో ఉన్న డార్మిటరీలు, అలాగే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వస్తువులు, లగేజీలు మరియు పార్కింగ్ ప్రదేశాలను తనిఖీ చేశారు.
ఇదే విధంగా చీమకుర్తి ఆర్టీసీ బస్టాండ్, ఆసుపత్రులు మరియు గ్రానైట్ ఫ్యాక్టరీల పరిసర ప్రాంతాలను కూడా డాగ్ స్క్వాడ్ మరియు బాంబ్ స్క్వాడ్ బృందం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని జిల్లా పోలీసులు కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని లేదా డయల్ 112 కాల్ చేయాలని సూచించారు.
జిల్లాలో శాంతి భద్రతలు కాపాడేందుకు, నేర నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేసేందుకు జిల్లా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, ప్రజల భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యమన్నారు.
ఈ తనిఖీలో చీమకుర్తి సీఐ సుబ్బారావు, ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఎస్సై చెంచయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు సిబ్బంది పాల్గొన్నారు.

