స్వచ్ఛతను జీవన విధానంగా సమాజం మార్చుకునేందుకు ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

స్వచ్ఛతను జీవన విధానంగా సమాజం మార్చుకునేందుకు ఉద్యమ స్థాయిలో ముందుకు తీసుకెళ్ళాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల జిల్లా స్థాయి ప్రదానోత్సవం సోమవారం రిమ్స్ ఆడిటోరియంలో జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ తో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, పి డి సి సి బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, మాల కార్పొరేషన్ చైర్మన్ పి.విజయ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
             ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 17 కేటగిరీలలో రాష్ట్రస్థాయిలో 3, జిల్లా స్థాయిలో 49 అవార్డులు వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రస్థాయిలో అమరావతిలో జరుగుతున్న కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా కేంద్రంలోనూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులను ప్రదానం చేస్తూ ఉంటుందని, అదేవిధంగా తొలిసారిగా రాష్ట్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. సింగపూరు ప్రసిద్ధి కావటానికి స్వచ్ఛతే ప్రధాన కారణం అని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వచ్ఛతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ-వ్యర్ధాల నిర్వహణలో ఒంగోలు మున్సిపాలిటీకి ఉత్తమ అవార్డు ఇటీవల లభించిందని, ఇదే స్ఫూర్తిని జిల్లా వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లాలని అవార్డులు పొందిన వారికి సూచించారు.
             ఒంగోలు ఎమ్మెల్యే మాట్లాడుతూ …స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డుల కార్యక్రమాలను చేపట్టిందన్నారు. స్వచ్ఛ ఆంధ్ర ఆవిష్కరణతోనే స్వర్ణాంధ్ర ఆవిష్కృతం అవుతుందన్నారు. ఇప్పటికే ప్రతి నెల మూడవ శనివారం వివిధ ఇతివృత్తాలతో స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇతరులకు ఆదర్శంగా ఉండేందుకే ఈ అవార్డులను ప్రకటించినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ప్రకటించారు. స్వచ్ఛత, పరిసరాల శుభ్రత పై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
                పి డి సి సి బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ మన ఇంటితోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. రియాజ్ మాట్లాడుతూ గాంధీజీ కూడా స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన ఆలోచనలను గౌరవించి, వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా
ఉందన్నారు. మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛత అయినా, పరిసరాల అపరిశుభ్రత అయినా మన చేతుల్లోనే ఉంటుందన్నారు. పరిశుభ్రత మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ఈ దిశగా అవగాహన కల్పించేందుకే ఈ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాల కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ శుభ్రత వలన ఆరోగ్యంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగు పడుతుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన కోరారు.
              అవార్డులు పొందిన వారిని అతిధులు సత్కరించారు. స్వచ్ఛత, స్వర్ణాంధ్ర ఆవిష్కరణపై ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు రచన, గాయకుడు నూకతోటి శరత్ స్వర కల్పన చేసిన పాటను కలెక్టర్ , ఇతర అతిధులు ఆవిష్కరించారు.
                 అవార్డులు పొందిన చీమకుర్తి మండలం ఆర్.ఎల్.పురం గ్రీన్ అంబాసిడర్ కడియం రాజమ్మ, సార్డ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆర్.సునీల్, ఎర్రగొండపాలెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్
డాక్టర్ డి.ఎడిదయ్య, మార్కాపురం మున్సిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీపార్వతి, కొత్తపట్నం మండల ఏపీఎం విజయ కుమారి తమ అనుభవాలను పంచుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

          రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినుల నృత్య ప్రదర్శనలు ఆహూతులను  ఆకర్షించాయి. మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *