సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలి – రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్పర్సన్ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్పర్సన్ , రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.కృష్ణయ్య
స్పష్టం చేశారు. ఒకవైపు దీని వినియోగాన్ని నివారించి, మరోవైపు
ఇప్పటికే ఉన్న వ్యర్ధాలను రీసైకిల్ , రీయూజ్
చేయటం ద్వారా సర్క్యులర్ ఎకానమీ పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. మంగళవారం ఒంగోలు వచ్చిన ఆయన కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనములో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, ఇతర అధికారులతో వివిధ అంశాలపై కృష్ణయ్య చర్చించారు.
పరిశ్రమల ఏర్పాటు ద్వారా, ముఖ్యంగా ప్రకాశం వంటి జిల్లాలలో ఉపాధి అవకాశాలు పెంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదే సమయంలో కాలుష్యాన్ని కూడా తగ్గించడంపై దృష్టి సారించాల్సిన అవసరం సంబంధిత శాఖలపై ఉందన్నారు. ఇప్పటికే గ్రానైట్స్ తో పాటు మత్స్య, వ్యవసాయ- దాని అనుబంధ రంగాలలో అవలంబిస్తున్న విధానాల ద్వారా వస్తున్న వ్యర్ధాల వలన పర్యావరణం కాలుష్యం అవుతున్న తీరుపై ఆయన చర్చించారు. ఆయా రంగాల ద్వారా వస్తున్న వ్యర్ధాలను రీయూజ్ చేయటంపై దృష్టి పెట్టాలని అధికారులకు చెప్పారు. ఈ దిశగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వ్యర్థాలను ఉపయోగించుకుని వివిధ ఉత్పత్తులను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వలన కలిగే ఆరోగ్యపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తయారీకి ప్రభుత్వం అనుమతులు ఇవ్వనందున పొరుగు రాష్ట్రాల నుంచి రవాణా జరగకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆయన చెప్పారు. వీటిని వినియోగిస్తే విధించే జరిమానాల గురించి చిల్లర వర్తకులకు కూడా అవగాహన కల్పించాలని, అదే సమయంలో తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ప్రత్యామ్నాయాలను కూడా చూపించాలని చెప్పారు. బయోడీగ్రేడబుల్ సంచులను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని, సర్కులర్ ఎకానమీకి కూడా ఊతమిచ్చినట్లు అవుతుందని వివరించారు. ఈ దిశగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య చెప్పారు. పరిశ్రమలతో పాటు రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ల పరిసరాలు శుభ్రంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రానైట్ పరిశ్రమల వ్యర్థాలను ఉపయోగించి స్థానికంగానే ఇతర ఉత్పత్తులు తయారుచేసేలా ఉన్న అవకాశాలను గుర్తించాలని దిశా నిర్దేశం చేశారు. గ్రానైట్ వ్యర్థాల కోసం నిర్దిష్ట స్థలం గుర్తింపు, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయాన్ని ఒంగోలులో నిర్మించేందుకు అవసరమైన స్థలం కేటాయింపుపైనా కృష్ణయ్య చర్చించారు.
కలెక్టర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగ నివారణ, వివిధ రంగాల ద్వారా వచ్చే కాలుష్యాన్ని నివారించేందుకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్ పర్సన్ చేసిన సూచనలను సంబంధిత శాఖలు సమన్వయంతో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ. రాఘవరెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డిఓ కళావతి, జిల్లా వ్యవసాయ అధికారి ( ఇంచార్జ్) రజనీకుమారి, డీఎస్ఓ పద్మశ్రీ, ఏపీ ఎం.ఐ.పీ. పీ.డీ. శ్రీనివాసులు, జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ గోపీచంద్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పానకాలరావు, అన్ని మునిసిపాలిటీలు, అటవీ, రవాణాశాఖల అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *