జిల్లాలో భూగర్భ జల మట్టం మరింత పెరిగేలా గ్రామ స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికతో పాటు గ్రామాల వారీగా వాటర్ డిమాండ్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు భూగర్భ, జల వనరుల శాఖ, డ్వామా, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ, ఉద్యాన శాఖ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశమై జిల్లాలో గ్రామ స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికల రూపకల్పన పై సమీక్షించి తగు సూచనలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో భూగర్భ జలాలు పెరగడానికి గ్రామ స్థాయిలో వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకొని 20 మీటర్ల కంటే ఎక్కువ భూగర్బ జల మట్టం ఉన్న గ్రామాల్లో మరియు 8 నుండి 20 మీటర్ల భూగర్బ జల మట్టం ఉన్న గ్రామాల్లో ఏ ఏ చర్యలు చేపడితే భూగర్భ జల మట్టం పెరిగే అవకాశం ఉంటుందో పరిశీలన చేసి వాటర్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా జిల్లా లోని 799 ఇరిగేషన్ ట్యాంక్స్ లో మరియు సంబంధిత ఫీడర్ ఛానెల్స్ లో ఉపాధి హామీ పథకం నిధులను అనుసంధానిస్తూ పూడికతీత పనులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకనుగుణంగా నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్, ఇరిగేషన్, డ్వామా అధికారులను ఆదేశించారు. అన్నీ శాఖల అధికారులు సమన్వయం తో పనిచేసి వాటర్ సోర్స్, వాటర్ డిమాండ్ పై సమగ్రంగా అధ్యయనం చేసి ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించేలా గ్రామాల వారీగా యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా వాటర్ మేనేజ్మెంట్ పై సంబంధిత శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో జల వనరుల శాఖ, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ ఎస్.ఈ లు వరలక్ష్మి, బాల శంకర రావు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, గ్రౌండ్ వాటర్ శాఖ డిడి వందనం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర రావు, ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, ఎపిఎంఐపి పిడి శ్రీనివాస రావు, డ్వామా, వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
