సింగరాయకొండ సమీపంలో ఉన్న బీకేటీ బెల్లం కోటయ్య పొగాకు కంపెనీ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని ‘ఏ’ మరియు ‘బి’ బ్లాకులలో మంటలు విపరీతంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించే విషయం. బెల్లం కోటయ్య పొగాకు కంపెనీని గత కొన్నాళ్లుగా ఫెర్రీ ఫిలిప్పీన్ మెర్క్యులర్స్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ప్లీజ్ కు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. గురువారం రాత్రి వరకు ఫ్యాక్టరీలో యధా విధిగా కార్యకలాపాలు సాగించారు.
ఈ ప్రమాదంలో 10 మిలియన్ కేజీల పొగాకు మంటల్లో అగ్నికి ఆహుతై సుమారు 500 కోట్ల మేర నష్టం వాటిలినట్లు సమాచారం.
సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మరియు ఫ్యాక్టరీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపి, ప్రమాదానికి గల కారణాలను తక్షణం గుర్తించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందన్నారు. ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని అన్ని సంస్థలకు సూచనలు ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం పోలీస్ సిబ్బంది మరియు అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడానికి శ్రమిస్తున్నారు.
జిల్లా ఎస్పీ వెంట ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హాజరత్తయ్య, పిసిఆర్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సింగరాయకొండ ఎస్సై మహేంద్ర, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరి, జరుగుమల్లి ఎస్సై మహేంద్ర మరియు తదితరులు ఉన్నారు.


