ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యు.సుధాకర్ ఆధ్వర్యంలో జిల్లా పోలీసులు మరియు సిబ్బంది ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఒంగోలు టౌన్ ఆర్టీసీ బస్టాండ్, డార్మిటరీ, న్యూ మార్కెట్, ఓల్డ్ మార్కెట్, ప్రజారద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
పేలుడు పదార్థాలను కనుగొనేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన జాగిలం-చీత సహాయంతో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణాను గుర్తించడానికి, అనుమానాస్పద వ్యక్తులను పరిశీలించడానికి టాస్క్ ఫోర్స్ అధికారులు, స్పెషల్ పార్టీ సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.
ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ మరియు పార్శిల్ సెంటర్లలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో అనుమానాస్పద వస్తువులు, అపరిచిత లగేజీలను గుర్తించేందుకు బస్టాండ్ ఆవరణ, పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. అనుమానం కలిగిన ప్రయాణీకుల బ్యాగులను ప్రత్యేకంగా తెరిపించి చెక్ చేశారు. అంతేకాక, అనుమానాస్పదంగా కనిపించిన ప్రయాణీకుల గుర్తింపు కార్డులను పరిశీలించి, చిరునామాలు, ఇతర వివరాలను సేకరించారు.
అనుమానాస్పద పార్సిళ్లు కనిపించిన వెంటనే లేదా గుర్తించిన వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పటిష్టమైన భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.
ఈ తనిఖీలలో ఎస్సై శివరామయ్య, డాగ్ హ్యాండ్లర్ ప్రభాకర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


