గ్రామాల సమగ్ర అభివృద్ధి, సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. ఈ విషయాలలో నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఒంగోలు డివిజన్ లోని పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రెగ్యులర్ విధులతో పాటు తమ పరిధిలో జరిగే అభివృద్ధి, ప్రభుత్వ ఆస్తులకు భద్రత, పారిశుద్ధ్యము,ప్రజారోగ్యం, తాగునీటి సరఫరా సంబంధిత అంశాల పైన పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఆయన గుర్తు చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంలోనూ పారిశుధ్యము అత్యంత కీలకమన్నారు. ఇళ్ల నుంచి చెత్తను సేకరించడంలో ప్రభుత్వం మార్గదర్శకాలను పగడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని చెప్పారు. పాఠశాలలు, అంగన్వాడీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రత్యేకంగా కొన్ని స్థలాలను ఎంపిక చేసి స్వచ్ఛతలో అవి నమూనాగా నిలిచేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఆ ప్రాంతాలలో చెత్త వేయకుండా ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినందున దీనిపైనా ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేకంగా ప్లాస్టిక్ వ్యర్ధాల కోసం వీధి చివర్లో చెత్త డబ్బాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు.
పంచాయతీకి సంరక్షణ అధికారిగా ( కస్టోడియన్ ) కార్యదర్శులపై తమ పరిధిలోని ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇది పూర్తిగా
రెవెన్యూకు సంబంధించిన అంశమని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. గ్రామాలలో జరుగుతున్న స్వమిత్వ సర్వేలను పర్యవేక్షించాలని ఆయన చెప్పారు. పంచాయతీల పరిధిలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలలోనూ కార్యదర్శులు భాగస్వాములు కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించినట్లుగా జీ.వీ.ఏ. పెంచడంలో పంచాయతీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని ఆయన తెలిపారు. త్రాగునీటి సమస్య కేవలం ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి మాత్రమే చెందినదని అనుకోరాదని, స్థానిక పరిస్థితులపై పంచాయతీ కార్యదర్శుల సమగ్ర పర్యవేక్షణ అవసరమని అన్నారు. ఈ విధులలో మొక్కుబడిగా వ్యవహరిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. వీటికి సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తినా పంచాయతీ కార్యదర్శులే బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా విషయాలకు సంబంధించిన రోజువారీ సమాచారాన్ని తనకు పంపించాలని ఉన్నతాధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో చిరంజీవి, డివిజనల్ పంచాయతీ అధికారి పద్మ పాల్గొన్నారు.

