భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముక – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు-యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాలి    –      ఘనంగా జిల్లాస్థాయి యువజనోత్సవాలు

 భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముక అని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఇతర అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
           ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… యువత నుంచి నూతన ఆవిష్కరణలు, ఆలోచనల కోసం సమాజం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ నూతన ఆలోచనలు, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తమ ప్రజ్ఞాపాటవాలను ప్రదర్శించేందుకు యువతకు ఇలాంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. యువతకు మెరుగైన భవిష్యత్తును కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. తాను కూడా జిల్లాలో ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రత్యేకంగా జిల్లాకు సంబంధించిన ఒక యాప్ ను అభివృద్ధి చేయిస్తున్నానన్నారు. దీని ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో నిపుణులైన వారితో జిల్లాలోని యువత అనుసంధానం కావచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్టెప్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి. శ్రీమన్నారాయణ మాట్లాడుతూ …ఈ యువజనోత్సవాలలో 7 అంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, వీరిలో జిల్లా స్థాయి లో ప్రధమ స్థానంలో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు జిల్లా తరపున పంపుతామని తెలిపారు. కావున ఈ పోటీలలో పాల్గొనేవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని ఆకలింపు చేసుకోవాలని సూచించారు.
కాలేజీ ప్రిన్సిపాల్ హనుమంతరావు మాట్లాడుతూ విద్యా బోధనతో పాటు విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసే ఇలాంటి కార్యక్రమాలకు తాము ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రమాదకరమైన డిజిటల్ ఎడిక్షన్, మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులు కాకుండా యువతలోని ప్రతిభ వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయి అన్నారు. మెప్మా పిడి శ్రీహరి మాట్లాడుతూ యువజనోత్సవాల వలన కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి అన్నారు.
              అనంతరం విద్యార్థులు చేసిన వినూత్న ప్రాజెక్టులను కలెక్టరు సందర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *