భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ పి.రాజాబాబు
తెలిపారు.
బుధవారం నుంచి జిల్లావ్యాప్తంగా ఈదురుగాలు, వర్షాలు కురుస్తాయని సమాచారం వచ్చినందున జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న ఐదు మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేశామన్నారు. మత్య్సకారులు వేట వెళ్లవద్దని ఆయన సూచించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాల ఏర్పాటుకు ప్రదేశాలను గుర్తించామన్నారు. అసరమైన పక్షంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి పరిస్దితిని సమీక్షిస్తున్నామన్నారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్
భారీ వర్షాల హెచ్చరిక దృష్ట్యా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రకాశం భవనంలో 1077 టోల్ ఫ్రీ నంబరుతో కమాండ్ కంట్రోల్ రూమును అధికారులు ఏర్పాటు చేశారు. 24 గంటలూ పనిచేసేలా ఏర్పాటుచేసిన ఈ కంట్రోల్ రూములో విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, పోలీస్, వైద్య, రెవిన్యూ, పశుసంవర్ధక శాఖలకు చెందిన సిబ్బందికి విడతల వారీగా విధులు కేటాయించారు.
పరిస్థితిపై నిరంతర పర్యవేక్షణ
భారీ వర్షాల దృష్ట్యా అవసరమైన సహాయక చర్యలు చేపట్టడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయమై జిల్లాస్థాయి అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సామగ్రి, రేషన్ సరుకులను పూర్తిస్థాయిలో అందుబాటులో పెట్టుకోవాలని చెప్పారు.
