ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు -జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహణ

 ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో ఇసుక లభ్యత,‌ రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డులలో అందుబాటులో ఉంచడం, తదితర అంశాలను గనుల  శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. ఇసుక స్టాక్ యార్డుల నిర్వహకులతోనూ, రవాణాదారులతోనూ
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడి నిర్వహణ, రవాణాలో ఎదురవుతున్న ఇబ్బందులు పై ఆరా తీశారు.
             స్థానికంగా ఉన్న వాగులు, వంకలలో లభ్యమయ్యే ఇసుకను స్థానికులే వినియోగించుకోవాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఒంగోలు నగరంలోకి తీసుకువస్తున్నారని, ఫలితంగా ఈ యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రవాణాదారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆయన స్పందిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి ఐదు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీసు,  మైనింగ్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను నియమించి ఈ అక్రమ రవాణాను నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజలకు ఇసుక సరసమైన ధరలో అందుబాటులో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ లక్ష్యానికి, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తమ గ్రామాల్లోని వాగులు, వంకలకు బయట నుంచి వాహనాలు వస్తే వాటిని అడ్డుకునేలా
ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. ఇసుకను రవాణా చేసే వాహనాలకు ఫిట్నెస్,
ఇతర పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేవో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, ప్రజలకు అవసరమైన స్థాయిలో స్టాక్ యార్డులలోనూ ఇసుకను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ యార్డుల నుంచి ఇసుకను కొనుగోలు చేసే విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయేమో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. గత 6 నెలల కాలంలో యార్డుల నుంచి ఇసుకను కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరించి, వారితో మాట్లాడాలని గనుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.  సరసమైన ధరలకే ఇసుక లభ్యం కావడం, ఈ విషయంలో ప్రజల్లోనూ సానుకూల అభిప్రాయం వ్యక్తం కావటమే లక్ష్యంగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇసుకపై సమీక్ష సమావేశం నిర్వహిస్తానని ఆయన తెలిపారు.
           ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ, ఒంగోలు ఆర్డీవో కళావతి, ఒంగోలు డి.ఎస్.పి. ఆర్. శ్రీనివాసరావు, డిటిసి సుశీల, ఆర్డబ్ల్యూఎస్. ఎస్.ఈ. బాల శంకరరావు, భూగర్భ నీటి వనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *