జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు తక్షణ స్పందన ఇవ్వడానికి జిల్లా పోలీసు శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు మరియు పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయటం జరిగిందని, అవి 24×7 అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద ప్రమాద సూచన ప్రాంతాల్లో పికెట్స్ ఏర్పాటు చేయాలని, రాత్రి పూట కూడా నిరంతర గస్తీ నిర్వహించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు.
వరదల తీవ్రత, నష్టం, రహదారుల్లో ఏర్పడిన చీలికలు, ప్రజలు చిక్కుకుపోయిన ప్రాంతాలు మరియు సహాయక చర్యల స్థితిని అంచనా వేయడానికి అవసరమైన ప్రాంతాల్లో డ్రోన్ సేవలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాలు, నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైనచోట సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు గుర్తించి ప్రజల భద్రత కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.
లోతట్టు ప్రాంతాల నుండి సమన్వయంతో కూడిన సహాయం మరియు తరలింపు చర్యలు చేపట్టేందుకు రెవెన్యూ, మత్స్య, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటిపారుదల, విద్యుత్ మరియు ఇతర సంబంధిత విభాగాల అధికారులతో సమన్వయం కొనసాగించాలని తెలిపారు.
వ్యవసాయ పనులకు వెళ్లే సమయంలో ప్రజలు చెట్ల కింద ఉండరాదని, అ సమయంలో పిడుగుపాటుకు గురయ్యే అవకాశం ఉందని జాగ్రత్త వహించాలని కోరారు.
సముద్ర తీరం వెంబడి నివసిస్తున్న ప్రజలు రెవెన్యూ మరియు పోలీస్ శాఖ అధికారులు ఇచ్చే సూచనలను పాటించి, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు లేదా తుఫాన్ షెల్టర్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.
ఈదురు గాలులు లేదా వర్షాల కారణంగా రహదారులపై చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలిన సందర్భాల్లో వెంటనే సమాచారం అందించి, వాటిని తొలగించే చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని చెప్పారు.
ఉధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల ప్రాంతాల్లో ఈత కొట్టడం, చేపలు పట్టడం వంటి పనులకు ఎవరూ వెళ్లరాదని హెచ్చరించారు. మత్స్యకారులు కూడా ఈ వర్షాల సమయంలో సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో శిథిలాలను తొలగించడానికి ప్రొక్లెయిన్లు/జెసిబిలను సిద్ధంగా ఉంచాలన్నారు. రెయిన్ కోట్లు, తాళ్లు, అత్యవసర లైట్లు, పవర్ రంపపు కట్టర్లు, బ్యాకప్ విద్యుత్ వనరులు వంటి ముఖ్యమైన పరికరాలను, వరద సహాయ చర్యల కోసం మత్స్యకారులు, ఈతగాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమ విధులను నిర్వహించాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కొరకు డయల్ 112కి, పోలీస్ వాట్సాప్ నెంబర్ 9121102266 లేదా సంబంధిత స్ధానిక పోలీసు అధికారులకు సమాచారమివ్వాలని జిల్లా ఎస్పీ కోరారు.
