తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉంది – కలెక్టర్ పి.రాజాబాబు

      తుఫాను ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధమై ఉందని కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసుతో కలిసి శనివారం ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా తీసుకున్న చర్యలతో పాటు, వచ్చేవారం జిల్లా పైన మంతా తఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్న తీరును ఆయన వివరించారు.
                 గత నాలుగు రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలను యంత్రాంగం సమర్ధంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. భారీవర్ష ప్రభావిత ఆరు ఆవాస ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత కేంద్రాలకు తరలించామన్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. మరోవైపు, మంతా తుఫాను ప్రభావం ఈనెల 27, 28, 29 తేదీలలో ప్రకాశం జిల్లాపైనా ఉంటుందనే హెచ్చరికల దృష్ట్యా మూడంచెల ప్రణాళికతో జిల్లా యంత్రాంగం వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. తుఫానుకు ముందుగా తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, ప్రభావిత ప్రాంతాలను గుర్తిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా తుఫాను సమయంలో ప్రజలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ సహాయక చర్యలు చేపట్టే జిల్లా యంత్రాంగానికి సహకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తుఫాను సమయంలో ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కలెక్టర్ కోరారు. తుఫాను తర్వాత పరిస్థితిని సత్వరమే పూర్వస్థితికి తీసుకువచ్చేలా అవసరమైన చర్యలను ముమ్మరంగా చేపట్టేలా కావాల్సిన సామగ్రిని, మానవ వనరులను పూర్తిస్థాయిలో సమకూర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సమర్ధంగా ఎదుర్కొనేలా క్షేత్రస్థాయి సిబ్బంది మొదలు, జిల్లా స్థాయి వరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

కమాండ్ కంట్రోల్ సెంటర్లు …

           ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చేలా జిల్లాస్థాయిలో కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ కేంద్రాలలోనూ, మండల స్థాయిలోనూ ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబరుతో కంట్రోల్ రూమును ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా విద్యుత్తు శాఖ తరపున కూడా 9440817491 నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా డివిజన్లో స్థాయిలో కనిగిరి ( 7893208093), మార్కాపురం ( 9985733999), ఒంగోలు ( 9281034437)లో కూడా కమాండ్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటిలో ఏ కేంద్రానికి ఫోన్ చేసినా మొత్తం సమాచారం క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు చేరేలా ఏర్పాటు చేశామన్నారు. ఆ సమస్యను సత్వరమే పరిష్కరించేలా వివిధ శాఖల సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

బాధితులకు పరిహారం …

        ప్రస్తుత  భారీ వర్షాల దృష్ట్యా సముద్రంలో వేటకు వెళ్లకుండా మత్స్యకారులను అప్రమత్తం చేశామని, దీని ద్వారా తమ జీవనోపాధి కోల్పోతున్నట్లు వారు చెప్పారని కలెక్టర్ వివరించారు. ఇలాంటి ఐదు వేల కుటుంబాలను గుర్తించామన్నారు. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇబ్బంది పడినట్లు ఆయన తెలిపారు. వీరికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు చెప్పారు.

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి…

        జిల్లాలో రెవెన్యూ సమస్యలపైన ‘ మీకోసం ‘ కార్యక్రమములో అధిక అర్జీలు వస్తున్నట్లు గుర్తించామని కలెక్టర్ చెప్పారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఆన్లైన్లో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతోనే కనిగిరి తహసిల్దారును సస్పెండ్ చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా
కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *