ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘ మీకోసం ‘ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రధమపనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ పి.రాజాబాబుస్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ప్రకాశం భవనంలోని తన చాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడడం, అర్జీదారులతో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆరా తీశారు. సమస్యలను సకాలంలో సహేతుకంగా పరిష్కరించడంతోపాటు అర్జీదారులతో మాట్లాడే తీరు కూడా గౌరవప్రదంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ‘ మీకోసం ‘ కార్యక్రమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కోణంలో అర్జీదారులకు ఫోన్ చేసి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీ, విద్య, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించిన అర్జీలు పెండింగ్లో ఉంటున్నట్లు మీకోసం విభాగ జిల్లా నోడల్ ఆఫీసర్ మాధురి ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. సకాలంలో అర్జీలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న విభాగాలను, అధికారుల వివరాలను ప్రతిరోజూ తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆమెను ఆదేశించారు. అర్జీలను పరిష్కరించడంలో జాప్యం చేస్తున్న హనుమంతునిపాడు, పుల్లలచెరువు తాసిల్దారులతో కలెక్టర్ అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడారు. డిపిఓ వెంకటేశ్వరరావు, డీఈవో కిరణ్ కుమార్, రోడ్లు భవనాల శాఖ ఎస్.ఈ. రవి నాయక్ లను కూడా తన చాంబర్ కు పిలిపించి అర్జీల పరిష్కారంలో జాప్యం ఎంత మాత్రమూ సరికాదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ‘ మీకోసం ‘ అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ కృష్ణమోహన్, సూపరింటెండెంట్ నాగజ్యోతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

