రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపండి… మీ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోండి – ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు

ప్రజల భద్రత, ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు మరియు సుదూర ప్రయాణీకుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాల బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, లారీలు, వ్యాన్లు తదితర వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, వాహనాలు పత్రలను పరిశీలించారు.
ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రయాణీకులు సురక్షితంగా బయటపడేందుకు అవసరమైన భద్రతా పరికరాలు వాహనాల్లో ఉన్నాయా లేదా అనే అంశంపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. అత్యవసర తలుపుల పనితీరు, గాజు బ్రేకర్లు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు వంటి అంశాలను కూడా తనిఖీ చేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రకాశం జిల్లా పోలీస్ విభాగం చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ ప్రజల్లో భద్రత పట్ల అవగాహన పెంపొందించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

వాహనదారులు కేవలం పోలీస్ తనిఖీల భయంతో కాకుండా, ప్రజల ప్రాణాల విలువను గుర్తించి, స్వచ్ఛందంగా భద్రతా నియమాలను పాటించాలని ఎస్పీ సూచించారు. పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల భద్రత విషయంలో మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై జరిమానాలు విధించడం, భద్రతా లోపాలు ఉన్న వాహనాలను రోడ్లపై నడపకుండా నిలిపివేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

నో హెల్మెట్‌, సీటు బెల్ట్‌ లేకుండా డ్రైవింగ్‌, అతివేగం, ట్రిపుల్‌ రైడింగ్‌ వంటి ఉల్లంఘనలపై అవగాహన కల్పించాలని, లైసెన్స్‌ లేకుండా లేదా మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

ప్రజల మరియు విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *