హైదరాబాద్ నవంబర్ 5(జే ఎస్ డి ఎం న్యూస్) :
విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్‌ను మరవొద్దని, కోర్ పోలీసింగ్‌ను సమర్థవంతంగా నిర్వర్తిస్తే నేరాలకు అడ్డుకట్ట వేయొచ్చని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అన్నారు. పోలీసు వ్యవస్థ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీ ఆడిటోరియంలో సీనియర్ పోలీస్అధికారులు,ఎస్‌హెచ్‌వోలతో సీపీ సజ్జనర్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.శాంతిభద్రతలు-నిర్వహణ, నేరాల నియంత్రణ-దర్యాప్తు, కమ్యూనిటీఎంగేజ్మెంట్-టెక్నాలజీ అడాప్షన్, మానవ వనరుల నిర్వహణ, తదితర అంశాల ప్రాధాన్యతను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు ఆయన వివరిస్తూ.దిశా నిర్ధేశం చేశారు.
శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతే ద్యేయంగా మెరుగైన పోలీసింగ్ చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ అధికారి కూడా 100 శాతం తమ బాధ్యతను నిబద్దత, క్రమశిక్షణతో నిర్వహించాలని సూచించారు. సిబ్బందిని కేవలం ఒకే పనికి పరిమితం చేయొద్దని, అన్ని విభాగాల్లోనూ ప్రావీణ్యం సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరు వృత్తిని, ఉద్యోగాన్ని ప్రేమిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వివరించారు. తమ పరిధిలో జరిగే విషయాలకు ఎస్‌హెచ్‌వోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గతంలో కొన్ని కేసుల్లో నిర్లక్ష్యం వహించినట్లు దృష్టికి వచ్చిందని, ఆయా కేసులను మళ్లీ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.పోలీసింగ్ జాబ్ అనేది అనేక సవాళ్లతో కూడుకుని ఉంటుంది, వాటన్నింటిని అధిగమిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ముందుకు వెళ్లాలి. అన్ని కేసులను రోటిన్ గా తీసుకోవద్దు. ప్రతి చిన్న నేరాన్ని కూడా సమగ్రంగా దర్యాప్తు చేయాలి. చిన్న చిన్న నేరాలకు చెక్ పెట్టకుంటే.. భవిష్యత్‌లో అది పెద్ద నేరానికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ప్రతి కేసును సాంకేతికంగా అన్ని కోణాల్లో విశ్లేషణ చేయాలని వీసీ సజ్జనర్ అన్నారు.దర్యాప్తును వేగవంతం చేసేందుకు అత్యాధునిక సాంకేతికత ఏఐ వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దేశంలోనే తెలంగాణ, హైదరాబాద్ పోలీసులకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందని, దానిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీపీ (క్రైమ్స్) ఎం. శ్రీనివాస్, జాయింట్ సీపీ(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ (అడ్మిన్) జె. పరిమళ హానా నూతన్ , డీసీపీ(డీడీ) ఎన్. శ్వేత, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) కె. అపూర్వా రావు తో పాటు అన్ని జోన్ల డీసీపీలు పాల్గొన్నారు.





