ఎయిడ్స్ నివారణతోపాటు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేపట్టిందని, దీనిలో భాగంగా ఇంకా గ్రామీణ స్థాయి వరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఒక వినూత్నమైన వాహనాన్ని కేటాయించిందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ టెస్టింగ్ సెంటర్ వాహనాన్ని శుక్రవారం ఆయన ప్రకాశం భవనంలో రిబ్బన్ కట్ చేసే జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులతోపాటు వ్యాధి లక్షణాలు ఉన్న అనుమానితులు వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు కౌన్సిలింగ్ పొందేందుకు ప్రత్యేక వాహనాన్ని ప్రభుత్వం రూపొందించి జిల్లాకు అందించినట్లు చెప్పారు. ఈ వాహనంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు ఈ వాహనం వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వ్యాధిగ్రస్తులు పౌష్టికాహారం, తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ కౌన్సిలింగ్ వాహనంలో ఒక వ్యక్తి మాత్రమే ఉండి పరీక్షలు చేయడంతో పాటు కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల రోగి యొక్క వివరాలు బయటకు తెలిసే అవకాశం లేదని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ అధికారి బాలాజీ, సెక్టరోల్ అధికారులు, ఎయిడ్స్ నివారణ, వెల్నెస్ సెంటర్ల సిబ్బంది పాల్గొన్నారు.

