వాన నీటిని ఒడిసిపట్టడములో జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. అడుగంటిన భూగర్భ నీటి మట్టాన్ని తిరిగి ఆశవాహస్థితికి తీసుకురావడంలో సఫలీకృతమైంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే మెచ్చి… ప్రశంసా పత్రం ఇచ్చి… శభాష్ అంటూ వెన్నుతట్టి అభినందించింది. ఔను… వాటర్ షెడ్ పనులలో భాగంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో చేపట్టిన నీటి సంరక్షణ పనులకు కేంద్ర జలశక్తి శాఖ మురిసిపోయింది. జిల్లా యంత్రాంగం చేసిన కృషికి గుర్తింపుగా ‘ రెండవ జాతీయ ఉత్తమ నీటి పురస్కారం ‘ అవార్డును ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీ.ఆర్.పాటిల్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు ఈ అవార్డు అందుకున్నారు. ఆరవ జాతీయ ఉత్తమ జల పంచాయతీ అవార్డుకు కనిగిరి నియోజకవర్గం , పెదచెర్లోపల్లి మండలం, మురుగమ్మి గ్రామ పంచాయతీ ఎంపికైంది.
ఇదీ నేపథ్యం..!
2022 – 23 సంవత్సరంలో జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో వాటర్ షెడ్ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులను చేపట్టారు. వాటర్ షెడ్ నిధులు, ఇతర డిపార్ట్మెంట్ల భాగస్వామ్యంతో ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు పాటించారు. ఇందులో భాగంగా ‘ రిడ్జ్ – టు – వ్యాలీ ‘ విధానంలో వివిధ రకాలైన సహజ వనరుల యాజమాన్యపు పనులు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో మరియు భూగర్భ జలమట్టాలను పెంపొందించడంలో ఉత్తమ పద్ధతులను పాటించారు. ఖండిత కందకాల పనులు, చిన్న ఊట కుంటలు, పెద్ద ఊట కుంటలు, డగవుట్ పాండ్స్, అమృత్ సరోవర్లు, పూడికతీత పనులు చేయడం ద్వారా దాదాపు 8.21 లక్షల క్యూబిక్ మీటర్ల నీటిని నిలువ చేశారు. ఇందుకుగాను 51 పనులకు దాదాపుగా రూ. 97 లక్షల నిధులు ఖర్చు చేశారు. ఈ పనులలో సాధించిన పురోగతిని తెలియజేసేలా డాక్యుమెంటేషన్ చేయించి గత ఏడాది అక్టోబర్లో కేంద్రానికి నామినేషన్ పంపించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ నెలలో కేంద్ర బృందం వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితిని పరిశీలించింది. భౌగోళికంగా భిన్న పరిస్థితులు ఉన్న ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో నీటి సంరక్షణ పనులలో సాధించిన పురోగతిని అభినందిస్తూ జిల్లాకు జాతీయస్థాయిలో రెండో ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది. జిల్లా కలెక్టరుకు ఒక ట్రోఫీ, ప్రశంసాపత్రం, రూ.1.5 లక్షల నగదును అందించింది. ఈ పథకం అమలులో జిల్లాకు జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా పనులను పర్యవేక్షించిన డ్వామా పీ.డీ. జోసెఫ్ కుమారును కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందించారు.

