స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి “ధార్తీ మాతా బచావో అభియాన్” (భూమి మాత రక్షణ కార్యక్రమం-5050) కార్యక్రమం కింద “ధార్తీ మాతా బచావో నిగ్రాణి సమితి”ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, అధికారులతో సమావేశమై ధార్తీ మాతా బచావో అభియాన్” (భూమి మాత రక్షణ కార్యక్రమం-5050) కార్యక్రమం విధివిధానాలపై సమగ్రంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడానికి మరియు నేల ఆరోగ్యాన్ని కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ధార్తీ మాతా బచావో అభియాన్” కార్యక్రమాన్ని జిల్లా లో పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన విధంగా గ్రామ, సబ్ డివిజన్ మరియు జిల్లా స్థాయిలో ధార్తీ మాతా బచావో నిగ్రాణి సమితి లను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులు తమ పొలాల నేల పరిస్థితులను మెరుగుపరచడానికి, అలాగే అవసరం మేరకు ఎరువులను వివేకవంతంగా ఉపయోగించమని ప్రోత్సహించడం, రైతులకు పంపిణీ చేయబడిన నేల ఆరోగ్య కార్డు నేలలో సూక్ష్మ పోషకాల లోపాన్ని పరిష్కరించడంలో సహాయపడేలా ఈ కమిటీలు పనిచేయాల్సి ఉంటుందన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ఎక్కువై , వాటి అవశేషాలు మన ఆహారం ద్వారా మన శరీరం లోకి చేరుతున్నాయని, దానివలన కాన్సర్ వంటి పలు రకాల వ్యాధులకు మనం గురవుతున్నామని , కనుక ఎరువుల వినియోగం, ముఖ్యంగా యూరియా వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉందని, అందుకనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు పనిచేయాలన్నారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జెడి శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, పకృతి వ్యవసాయ అధికారి సుభాషిని, మార్క్ఫెడ్ అధికారి హరి క్రిష్ణ, జిల్లా సహకార శాఖాదికారి శ్రీలక్ష్మి, ఫెర్టిలైజర్స్ డీలర్స్ తదితరులు పాల్గొన్నారు.



