ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాల ఉద్యోగులపదోన్నతులలో జీవో ఎం.ఎస్ 127 ద్వారా ఉపవర్గీకరణ చేస్తూ జి ఓ చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుజన్ మాదిగ తెలియజేశారు. గురువారం ఒంగోలులోని స్థానిక ఎం ఎస్ పి ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగానే ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీ గ్రూపులుగా వర్గీకరించడం జరిగిందని, దీని ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు జరుగుతుందన్నారు. దీంతో పాటుగా షెడ్యూల్ కులాల ఉద్యోగుల పదోన్నతుల్లో కూడా, ఉప వర్గీకరణ చేపడుతున్నామని జి.ఓ చేయడం ద్వారా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు సుజన్ మాదిగ తెలియజేశారు. ఇప్పటివరకు ఈ విధానం లేకపోవడం ద్వారా రిజర్వేషన్లుద్వారా, ఉద్యోగాలు పొందిన వారందరూ పదోన్నతులు జరగక, ఉన్నటువంటి ఉద్యోగ స్థానాల్లోనే ఏళ్ల తరబడి ఉండటం చాలా బాధాకరంగా మారిందని, ఎస్సీ ఉద్యోగులు పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో పాటు, పలువురు ప్రజా సంఘాలు, కుల సంఘాలు ఆందోళనను ప్రభుత్వం గుర్తించి, ఎస్సీ ఉద్యోగాలలో ఉప వర్గీకరణ ద్వారా పదోన్నతులు కల్పించడం సంతోషకరమని సుజన్ తెలియజేశారు. ఇప్పటివరకు గత ప్రభుత్వాలు ఎస్సీ ఉద్యోగుల సాధకబాధలను కూడా అర్థం చేసుకోకుండా ఉందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, షెడ్యూల్ కులాల రిజర్వేషన్లలో ఉప వర్గీకరణను చేయటం అదేవిధంగా ఉద్యోగాల పదోన్నతుల్లో కూడా ఉపవర్గీకరణను పాటించాలని జీ.ఓ.చేయటం పట్ల మాదిగ, మాదిగ అనుబంధ కులాల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పిఎస్ ప్రతినిధులు గద్దె త్యాగరాజు, కొలకలూరి విజయ్ కుమార్, తేళ్ల జయరాజ్,బండారు సురేష్, పొగడ్త నారాయణ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
