జిల్లాలో మొంథా
గాయాలు మానక ముందే మరో తుఫాన్ దిత్వా ప్రభావం చూపుతుందన్న వాతావరణ శాఖ సూచనలతో ప్రజలు, రైతులు అందోళన చెందుతున్నారు. తుఫాన్ ప్రభావంతో ఆది, సోమవారాలలో జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శింగరాయకొండ, పొన్నలూరు, పామూరు, సీఎస్ పురం, టంగుటూరు, జరుగుమల్లి, కొమరోలు, ఒంగోలలొ ఆ ప్రభావం ఆదివారం కొంత తీవ్ర రూపం దాల్చటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తమైనారు. గత మూడు రోజులుగా శ్రీలంకను ముంచెత్తిన దిత్వా తుఫాన్ ప్రస్తుతం తమిళ నాడు తీరాన్ని అతలాకుతలం చేస్తుంది. చెన్నై – పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమైన తుఫాన్ అదివారం తీరానికి మరింత చేరువగా రావచ్చన్న వాతావరణ శాఖ సమాచారం. దీని ప్రభావం తిరుపతి, నెల్లూరు జిల్లాలపై తీవ్రంగా, ప్రకాశం జిల్లాపై ఓ మోస్తరులో ఉండవచ్చని వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో మత్స్య కారులు వేటకు వెళ్లకుండా అధికారులు తగిన సూచనలు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజా బాబు అధికారులతో పాటు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తుఫాన్ తో ప్రజలు తగిన జాగ్రత్తగా ఉండాలని, అధికార యంత్రాంగాన్ని సహకరించాలని అధికారులు అండగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాస రావు పలు మండలాలలో పర్యటించి రైతులు పంటలను కాపాడుకోవటానికి తగిన సూచనలు చేసారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఇటీవల మొంధా తుఫాన్కు దెబ్బతిన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పోతురాజు కాలువ వెంబడి ప్రాంతాల నివాసాల ప్రజలను ఆప్రమత్తం చెయ్యాలని అధికారులను కోరారు.
ప్రత్యేక కంట్రోల్రూమ్ ఏర్పాటు ..
దిత్వా నేపథ్యంలో జిల్లాలో 24 గంటలు ప్రజలను అందుబాటులో ఉండేందుకు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసారు. 08592-281400, టోల్ ఫ్రీ నంబర్ 1077ను కూడ సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ తెలిపారు.
తుఫాన్ ప్రభావంతో పాకల బీచ్ మూసివేత….
దిత్వా తుఫాన్ వాతావరణ పరిస్థితులు ఆందోళన కరంగా మారిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైనారు. సింగరాయకొండ మండల పాకల బీచ్ ని మూడు రోజులు తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆదివారం ప్రకటించారు.తుఫాన్ ప్రభావంతో పాకల తీరప్రాంతాల్లో సముద్రం ఉద్ధృతంగా మారి, ఎత్తైన అలలు, గాలివానలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ గుంటలు, సుడిగుండాలు ఏర్పడటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ప్రజలు బీచ్ పరిసర ప్రాంతాలకు రావద్దని జిల్లా డియస్పీ రాయపాటి శ్రీనివాసరావు హెచ్చరించారు.
పర్యాటకులు, భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా లోని అన్ని బీచ్‌ల వద్ద పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా మాలలు వేసిన స్వాములు స్నానాల కోసం బీచ్ ప్రాంతాలకు ప్రజలు రాకూడదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సముద్రతీరానికి దగ్గరగా వెళ్లకూడదని, పరిస్థితులు సర్దుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని సింగరాయకొండ తాశీల్దార్ రాజేష్ విజ్ఞప్తి చేశారు. అలాగే మత్స్యకారులు కూడా సముద్ర వేటను నివారించామని సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు నిత్యం పహారా కాస్తూ, ప్రజల భద్రతను పర్యవేక్షిస్తున్నామని సింగరాయకొండ సీఐ హాజరత్తయ్య, ఎస్.ఐ మహేద్ర తెలిపారు.



