దిత్వా తుఫాను ప్రభావంతో జిల్లాలో సోమ, మంగళవారాలు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తముగా ఉన్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను ఆదివారం ప్రకాశం భవనంలోని ‘ దిత్వా కమాండ్ కంట్రోల్ కేంద్రం’లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. జిల్లాలోని 14 మండలాలపై తుఫాను ప్రభావం ఉంటుందన్నారు. కనిగిరి, కొండపి, కొత్తపట్నం, మర్రిపూడి, మద్దిపాడు, నాగులుప్పలపాడు, ఒంగోలు, పామూరు, పీసీ పల్లి, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, సింగరాయకొండ, జరుగుమల్లి మండలాలలో తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నందున పరిస్థితిని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మొంతా తుఫాను నేపథ్యంలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుని ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ, నల్ల కాలువలో ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగానికి సహకరించేలా 30 మందితో కూడిన జాతీయ విపత్తుల నిర్వహణ బృందం ( ఎన్.డి.ఆర్.ఎఫ్) కూడా అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ చెప్పారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు ఆయన పిలుపునిచ్చారు. వరి కోతలను ఐదు రోజులపాటు వాయిదా వేసుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. తుఫాను దృష్ట్యా జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ మీకోసం ‘ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో డిఆర్ఓ బి.చిన ఓబులేసు, ఎన్.డి.ఆర్.ఎఫ్. కమాండర్ దిల్బాగ్ సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
