గాంధీ లో సాయి ఈశ్వర్ ను పరామర్శించిన ఎమ్మెల్యే తలసాని………

బేగంపేట డిసెంబర్ 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిసి లకు జరుగుతున్న అన్యాయంపై మనోవేదనకు గురై క్యూ న్యూస్ ఆఫీస్ వద్ద ఆత్మహత్య కు ప్రయత్నించి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు. సాయి ఈశ్వర్ భార్య, తల్లి ని పరామర్శించి తాము అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రస్తుతం సాయి ఈశ్వర్ ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్యం గురించి ఆర్ ఎం ఓ కళ్యాణ్, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శ్రీకాంతాచారి ఆత్మబలిదానం చేసుకోగా, తన చావుతో నైనా బిసి లకు 42 శాతం రిజర్వేషన్ వస్తుందని భావించి సాయి ఈశ్వర్ తన ఒంటికి నిప్పు అంటించుకొని ఆత్మబలిదానానికి సిద్ధపడ్డారని, ఇది చాలా బాధాకరం అని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పై పోరాడి 42 శాతం రిజర్వేషన్ ను సాధించుకుందామని, బిసి బిడ్డలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. సాయి ఈశ్వర్ పై ఆధారపడి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారని అన్నారు. రెండేళ్ల నుండి కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరిస్తూ పంచాయితీ ఎన్నికలలో 17 శాతం అమలు చేస్తూ తీరని మోసం చేసిందని విమర్శించారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలో 28 గ్రామపంచాయతీ లు ఉంటే 25 స్థానాలు ఏకగ్రీవంగా ఎలా అయ్యాయని ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా లో రవీందర్ అనే సర్పంచ్ అభ్యర్థి భర్త కాంగ్రెస్ పార్టీ నాయకుల బెదిరింపులు, వేధింపుల కారణంగా ఆత్మహత్య కు పాల్పడ్డాడని, నల్లగొండ జిల్లాలోని ఎల్లమగూడెం లో సర్పంచ్ అభ్యర్థి భర్త మామిడి యాదగిరి ని కిడ్నాప్ చేసి మూత్రం తాపించారని ఇది దుర్మార్గం అన్నారు. బిసి సంఘాలు, రాజకీయ పార్టీలు కలిసి పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని, యువత తొందరపాటు చర్యలకు లోనుకావద్దని కోరారు. బిసి లు ఒక్కటైతే రాష్ట్రంలో అగ్ని పుట్టిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తిగా దౌర్జన్యం, అగ్రకులాల ఆధిపత్యం తో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం ఏరులై పారుతున్నా, విచ్చవిడిగా డబ్బులు పంచి ప్రలోభాలకు గురి చేస్తున్నా ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి కనిపించవని అన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల్సిన అవసరం అన్నారు. సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ మా హక్కు…ప్రభుత్వం కామారెడ్డి లో ప్రకటించిన విధంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే నని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, బన్సీలాల్ పేట డివిజన్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వెంకటేషన్ రాజు, నాయకులు ఏసూరి మహేష్, లక్ష్మీపతి, శ్రీకాంత్ రెడ్డి, మహేందర్ గౌడ్, అంబులెన్స్ సురేష్, మహేష్ యాదవ్, కుమార్ యాదవ్, అబ్బాస్, శ్రీనివాస్, సుధాకర్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *