ఒంగోలు నగరం గుంటూరు రోడ్డు లోని లారీలకుంటలో నివాసం ఉంటున్న బీహార్ వాసి షేక్ దిల్షాద్ అనారోగ్యం బారినపడి రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు. రోజూ కూలికి వెళ్తే గాని పూట గడవని నిరుపేద దిల్షాద్ అనారోగ్యంతో రిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఉండడంతో ఇంట్లో గడవడం కూడా కష్టంగా ఉందని తెలుసుకున్న ప్రకాశం జిల్లా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు స్పందించి దిల్షాద్ భార్య ఆయేషాకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులను, దుప్పట్లు, బట్టలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు నిరుపేదలకు
నిస్వార్ధంగా చేస్తున్న సేవలు అభినందనీయం అన్నారు. రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కోలుకుంటున్న దిల్షాద్ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఖాదర్ వలి మాట్లాడుతూ లారీల కుంటలో నివాసం ఉంటున్న వలస కూలీ బీహార్ వాసి దిల్షాద్ అనారోగ్యం బారినపడటంతో కుటుంబ చాలా ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికుల ద్వారా తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి ప్రత్యక్షంగా చూసి వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను, బట్టలను సంఘ సభ్యుల సహకారంతో అందజేయడం జరిగిందన్నారు. దిల్షాద్ కోలుకునేంత వరకు దాతల సహకారంతో వారికి అవసరమైన సహాయం.. సహకారం అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు షేక్ ఫారుక్, కార్యదర్శి అయూబ్, ఒంగోలు టౌన్ అధ్యక్షులు బాజీ, కోశాధికారి గౌస్ బాషా, మండల వైస్ ప్రెసిడెంట్ రఫీ, సొసైటీ దాత వహీద్, తదితరులు పాల్గొన్నారు.
