హైదరాబాద్ డిసెంబర్ 16
(జే ఎస్ డి ఎం న్యూస్) :
హైదరాబాద్ మెట్రో రైల్ టేక్ ఓవర్ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరాంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే. రామకృష్ణారావు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యదర్శుల స్థాయి కమిటీ, ఎల్ అండ్ టీ అధికారులతో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మెట్రో రైల్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ తాజా పరిస్థితిని సమీక్షించారు. ఇరు పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బదలాయింపు సజావుగా వేగవంతంగా పూర్తి కావాలని సూచించారు.
ఈ ప్రక్రియను ఇదివరకటి ఒప్పందాలకు ఎటువంటి ఆటంకం లేకుండా చేపట్టాలని అయన స్పష్టం చేసారు. రాబోయే వంద రోజుల్లో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలన్నారు. టేక్ ఓవర్ ప్రక్రియ పై ఏర్పాటు చేసిన ట్రాన్సాక్షన్ అడ్వైజర్ ఐడీబీఐ ఈ మేరకు తన నివేదికను త్వరితగతిన పూర్తి చేసి బదలాయింపు ప్రక్రియను పూర్తి చేయాలనీ ఇందులో ఎల్ అండ్ టీ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ తర్వాత ఆపరేషనల్, మెయింటనెన్స్ కు సంబంధించి ప్రతిపాదనలను రూపొందించాల్సిందిగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ షెర్ఫరాజ్ అహ్మద్ కు సిఎస్ సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు (అర్బన్ ట్రాన్స్ పోర్ట్) ఎన్వీఎస్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ ఎండీ కేవీబీ రెడ్డి, ఐడీబీఐ అధికారులు, హెచ్ఎంఆర్ఎల్ ఛీఫ్ ఎలెక్ట్రికల్ ఇంజనీర్ డీవీఎస్ రాజు, అధికారులు పాల్గొన్నారు.

