జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డి. డి) ఎన్ లక్ష్మా నాయక్ గురువారం సాయంత్రం ముండ్లపాడు మరియు గిద్దలూరులోని ప్రభుత్వ బాలుర వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వసతి గృహాల్లోని వంటగది, స్టోర్ రూమ్, తాగునీటి వసతులు మరియు మరుగుదొడ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థులతో ముఖాముఖి…
వసతి గృహ విద్యార్థులతో నేరుగా మాట్లాడిన డిప్యూటీ డైరెక్టర్, వారికి అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.
మెనూ ప్రకారం భోజనం అందుతుందా?
ప్రతి నెలా వైద్యులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారా?
- ఇతర వసతులు ఎలా ఉన్నాయి? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
దీనికి స్పందనగా విద్యార్థులు, తమకు వసతులు చాలా బాగున్నాయని, వైద్యులు క్రమం తప్పకుండా వస్తున్నారని డీడీకి వివరించారు. అనంతరం గిద్దలూరు బాలుర వసతి గృహం-1లో విద్యార్థులతో కలిసి ఆయన రాత్రి భోజనం చేశారు. వడ్డించిన భోజన నాణ్యతను స్వయంగా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.
10వ తరగతి విద్యార్థులకు దిశానిర్దేశం…
పరీక్షల సమయం దగ్గర పడుతుండటంతో, పదో తరగతి విద్యార్థులతో ‘100 రోజుల యాక్షన్ ప్లాన్’ గురించి డీడీ ప్రత్యేకంగా చర్చించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి వసతి గృహానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
సిబ్బందికి హెచ్చరిక….
వసతి గృహాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని వార్డెన్లను, సిబ్బందిని హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యత కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వసతి గృహ సంక్షేమాధికారి బి. ఆంజనేయ రెడ్డి మరియు రెండు హాస్టళ్ల సిబ్బంది పాల్గొన్నారు.



