రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా
రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( మీకోసం)లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ రెవెన్యూ క్లినిక్ లో ప్రత్యేకంగా ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి అవసరమైన సిబ్బందిని నియమించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘ మీకోసం ‘ లో ఎక్కువ ఫిర్యాదులు రెవెన్యూ సమస్యలపై వస్తున్నాయని, అందువల్ల వాటి పరిష్కారానికి ప్రత్యేకంగా ఈ రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇందులో రెవెన్యూ సమస్య మూలం కనుగొనడంతోపాటు దానికి వెంటనే పరిష్కారం చూపుతామన్నారు. ముందుగా జిల్లా స్దాయిలో ఒక నెలరోజులపాటు నిర్వహించిన అనంతరం డివిజన్ స్దాయిలో ఈ క్లినిక్ లను నిర్వహిస్తామని తెలిపారు. చివరిగా మండల స్దాయిలో నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ సంబంధిత
సమస్యలను రెవెన్యూ క్లినిక్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
ఇదీ క్రమం…
రిసెప్షన్ : ముందుగా అర్జీని స్వీకరించేందుకు ఒక రిసెప్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తహసిల్దార్ స్థాయి అధికారి ఇందులో ఉంటారు. అర్జీని స్వీకరించి సంబంధిత రెవెన్యూ కౌంటర్ వద్దకు అర్జీదారుని పంపిస్తారు.
కౌంటర్ -1 : ఆర్.ఓ.ఆర్, పట్టాదారు పాస్ పుస్తకాలు, రిజర్వు ఫారెస్ట్ భూములకు సంబంధించిన సమస్యలను ఈ టేబుల్ వద్దకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
కౌంటర్ -2 : వెబ్ ల్యాండ్ నందు కొత్తగా సర్వేనెంబర్ నమోదు సమస్యలు, భూమి వివరణ మార్పులు, విస్తీర్ణంలో మార్పుల సమస్యలను ఈ టేబుల్ వద్దకు తీసుకువెళ్తారు.
కౌంటర్ -3 : చుక్కల భూములు, 22(ఏ)(1) తొలగింపు, ఇంటి నివేశన స్థలములు, అసైన్మెంట్ భూముల సమస్యలను ఈ టేబుల్ లోని అధికారులు పరిశీలిస్తారు.
కౌంటర్ – 4 : రీ సర్వే సమస్యలు, జాయింట్ ఎల్పీఎం, ఇతర సర్వే సంబంధిత సమస్యలను పరిశీలించేలా ఈ టేబుల్ ఏర్పాటు చేశారు.
కౌంటర్ – 5 : ఇతర భూసంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే ఈ టేబుల్ వద్దకు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
ఆయా సమస్యలను పరిష్కరించేందుకు మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులతోనూ తహసిల్దార్లు కూడా ఈ క్లినిక్ లో అందుబాటులో ఉంటారు. సంబంధిత ఆర్డీవోలు వీటిని పరిశీలిస్తారు.






