ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ఒక్క ఇసుక రేణువు తరలినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పాలేరు వాగు నుంచి జరుగుమల్లి, పొన్నలూరు మండలాల్లో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజుతో కలిసి సంబంధిత అధికారులతో సోమవారం ప్రకాశం భవనంలో ఆయన సమీక్షించారు. స్థానిక పరిస్థితులపై కలెక్టర్
ఆరా తీశారు.
వాగులు, ఇతర వనరుల్లో లభ్యమయ్యే ఇసుకను కేవలం 500 మీటర్ల పరిధిలోని స్థానిక గ్రామస్తులు మాత్రమే వినియోగించుకునేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చిందన్నారు. అంతేతప్ప… పాలేరులో ఇసుకను తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించడానికి అనుమతి లేదన్నారు. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేసిన యార్డుల నుంచి మాత్రమే వినియోగదారులు ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుకను తవ్వినా,
రవాణా చేసినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలను సీజ్ చేయాలని చెప్పారు. పాలేరులోని ఇసుకను వాగు ప్రవహిస్తున్న గ్రామాల ప్రజలే వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేసి, ఇసుక అవసరం ఉన్నట్లుగా పంచాయతీ కార్యదర్శి ద్వారా రసీదు తెచ్చుకున్న వారికే సరఫరా
చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ‘ ఉచిత ఇసుక ‘ పేరుతో అక్రమంగా తవ్వినా, రవాణా చేసినా బాధ్యులపై ఉక్కుపాదం మోపాలని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ప్రకటించిన ‘ ఉచిత ఇసుక ‘ విధానంపై స్థానిక ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, డిటిసి సుశీల, ఒంగోలు డి.ఎస్.పి. ఆర్. శ్రీనివాసరావు, సంబంధిత మండలాల తహసీల్దారులు, పోలీసు ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

