నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి అసాంఘిక, అనుచిత, అనుమతులు లేని కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. నూతన సంవత్సర సంబరాల నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంచనీయ ఘటనలు జగరకుండా పోలీస్ అధికారులు అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలి ఆదేశాలు జారీ చేశారు.న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనుటకు కేక్ కట్టింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే సంగీతం,రోడ్డు కూడళ్ళలో గుమిగూడటం, బహిరంగంగా పార్టీలు, నృత్యాలు తదితర నూతన సంవత్సర వేడుకలను బహిరంగ ప్రదేశములలో నిర్వహించరాదు. పెద్ద పెద్ద ధ్వనులతో లోడ్ స్పీకర్లు/డీజే లు పెట్టి ప్రజాశాంతికి, ప్రజా క్రమానికి భంగం కల్గించరాదు. బహిరంగ ప్రదేశాల్లో టపాకాయలు కాల్చడం మరియు ఏ విధమైన ప్రదర్శనలు నిర్వహించడం అనుమతి లేదు. హాస్పిటల్స్, వృద్ధాశ్రయాలు మరియు ఇతర సున్నితమైన ప్రాంతాల్లో పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు డీజేలు పెట్టరాదు. ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్ తీసేసి అధిక శబ్దాలతో ర్యాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, బైక్, కార్ రేసింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సంబరాల పేరుతో రౌడీయిజం చేసినా, దురుసుగా ప్రవర్తించినా, బహిరంగ ప్రదేశాల్లో జన నివాస/సంచార ప్రదేశాల్లో మద్యం సేవించినా, మద్యం మత్తులో డ్రైవ్ చేసినా, ప్రజా రవాణాకు అడ్డంకులు సృష్టించేలా వాహనాలు నడపినా ఉపేక్షించేది లేదన్నారు. వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, దబాలు మరియు ఇతర అవుట్ లెట్లు, వ్యాపార సముదాయాలను నిర్దేశిత సమయాల్లో మూసివేయాలి లేనిచో చట్టపరమైన చర్యలు తప్పువు. ఒంగోలు పట్టణంలో బైక్ రేసింగ్ మరియు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాత్రి 10 గంటల తర్వాత కర్నూల్ రోడ్ బైపాస్ ఫ్లైఓవర్‌ను మూసివేస్తారు.జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ డి.ఎస్.పి ల పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో డిసెంబర్ 31వ తేది సాయంత్రం నుండి అన్ని ముఖ్య కూడళ్ళలో పోలీస్ పికెట్స్ 136, మొబైల్ పార్టీలు : 56,డ్రంక్ అండ్ డ్రైవ్ / ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌లు : 30, నైట్ గస్తీ బృందాలను వుంచి నూతన సంవత్సర వేడుకలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసేలా నిరంతర పోలీసు నిఘా ఉంటుందన్నారు.ఒంగోలు పట్టణంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాలు మరియు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనున్నారు. ఒంగోలు పట్టణంలోని కొప్పోలు రోడ్, మంగమూరు రోడ్ మరియు పేర్నమిట్ట రోడ్‌లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయబడతాయి. అనవసర సంచారాన్ని నివారించేందుకు డ్రోన్ పర్యవేక్షణతో పాటు పెట్రోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల కదలికలను పర్యవేక్షించేందుకు ఎం. ఎస్.సి.డి లను వినియోగించనున్నారు. ప్రజలు గమనించి స్థానిక పోలీసులకు సహకరించాలని, ఎవరైనా మితిమీరి ప్రజా జీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేసారు.ప్రజలందరూ బాధ్యతాయుతంగా బంధుమిత్రులతో కలసి ఆనందంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, ఈ నూతన సంవత్సరం జిల్లా ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, సరికొత్త విజయాలను అందుకొని అందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు.
