ప్రధాని విశ్వకర్మ యోజన పథకం వివిధ పనిముట్ల తో పనులు నిర్వహిస్తున్న వారందరికీ ఎంతో ఉపయోగం. కేంద్ర ప్రభుత్వం సూచించిన 18 రకాల పనివారలు ప్రతి ఒక్కరూ విశ్వకర్మ యోజన పథకంలో పేరు నమోదు చేసుకొని లబ్ధి పొందాలని భారతీయ జనతా పార్టీ ఒంగోలు నగర మహిళా మోర్చా అధ్యక్షురాలు ధనిశెట్టి పావని పిలుపునిచ్చారు.
డిసెంబరు 21వ తేది గురువారం, 22వ తేది శుక్రవారం తేదీలలో 70 మందికి పైగా లబ్ధిదారులను గుర్తించి వారందరిచే ప్రధాని విశ్వకర్మ యోజన పథకానికి దరఖాస్తు చేయించారు. నాయి బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు తదితర వృత్తులు నిర్వహిస్తున్నవారికి ప్రధాని విశ్వకర్మ యోజన పథకాన్ని వివరించి వారందరి చే ఆన్లైన్ దరఖాస్తు చేయించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి తీగల సత్యవతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ధనిశెట్టి పావని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 39 లక్షల మంది ఈ పథకానికి నమోదు చేసుకున్నారని దేశంలో సూచిత పనిముట్లతో పనిచేస్తూ జీవితం గడుపుతున్న ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఈ పథకాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు ఆన్లైన్ చేసుకున్న వారందరినీ స్థానిక అధికారులు పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రధాని విశ్వకర్మ యోజన గుర్తింపు కార్డుతో పాటు రోజుకు 500 గౌరవ వేతనముతో కూడిన, 40 గంటలపాటు తత్ సంబంధిత శిక్షణ ఇస్తారని, 15వేల రూపాయల విలువైన పనిముట్లను అందజేసి ఆయా పనులలో మరింతగా రాణించే విధముగా సహకారం అందిస్తారని, మొదటి విడత 12 నెలలలో తిరిగి జమ చేసే పద్ధతిలో లక్ష రూపాయల రుణాన్ని తదుపరి విడత 30 నెలల్లో తీర్చే విధంగా రెండు లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేస్తారని తెలిపారు. తదుపరి తయారుచేసిన వస్తువులను మార్కెటింగ్ చేసే విధానంలో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సహకారం అందిస్తారని వివరించారు. కనుక నగరంలోని వడ్రంగి, పడవలు తయారు చేసేవారు, ఆర్మర్, కమ్మరి, సుత్తి మరియు పనిముట్టు తయారిదారులు, తాళాలు తయారు, బాగు వేసేవారు, బంగారు పనివారలు, కుమ్మరి, శిల్పి, రాతి పనివారలు, చర్మకారులు, మేసన్, బుట్టలు, చీపుర్లు, బొమ్మలు తదితర వస్తు తయారిదారులు, నాయ బ్రాహ్మణ, దండల తయారిదారులు, చాకలి, దర్జీ మరియు వలలు నేసేవారు అందరూ ధరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

