దర్శి టౌన్ పూర్తిగా పోలీస్ కంట్రోల్ లోకి వెళ్ళింది. ప్రకాశం జిల్లాలో అనేక చోట్ల నుండి అదనపు పోలీసు బలగాలు దర్శి కి చేరుకున్నాయి. దర్శి నియోజకవర్గంలో టిడిపి వైసిపి ల మధ్య ఏర్పడిన ఘర్షణల వాతావరణంతో ఒక్కసారిగా దర్శి వేడెక్కింది. వైసిపి వర్గీయులపై టిడిపి వర్గీయులు దాడులకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు టిడిపి కూడా మాపైనే వైసిపి వర్గీయులు దాడులు చేస్తున్నారంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నారు. 300 మంది పోలీసులు దర్శి టౌన్ మొత్తాన్ని కంట్రోల్లో కి తీసుకున్నట్లు తెలుస్తుంది. శాంతి భద్రతల పరిరక్షణకు ఇరు పార్టీల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు.
