ప్రకాశం జిల్లా జీవనాడి అయిన వెలుగొండ ప్రాజెక్ట్ ను ప్రాధ్యాన్యతా క్రమంలో త్వరలో పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించడం జరుగుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
మంగళవారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రకాశం ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డా. డోలా బాలవీరంజనేయస్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, శాసన సభ్యులు, వివిధ కార్పొరేషన్స్ చైర్మన్ల తో కలసి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సందర్శించిన అనంతరం
మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ….ఎన్డీయే ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత ప్రాజెక్ట్స్ లో పోలవరం ప్రాజెక్ట్ తరువాత వెలుగొండ ప్రాజెక్ట్ అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు కు సంబంధించి ఫేజ్-1లో హెడ్ వర్క్స్, రెండు టన్నెల్స్ , ఫీడర్ ఛానెల్, లైనింగ్ వంటి నిలిచినపోయిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేలా షెడ్యూల్ ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి తెలిపారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేసేలా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఉమ్మడి ప్రకాశం జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈ రోజు ప్రాజెక్టును పరిశీలించడం జరిగిందన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 22 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. 1996 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్ట్ కు భూమి పూజ చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ను త్వరగా పూర్తి చేసి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేతులమీదుగా ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు, తాగునీరు విడుదల చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. 2014-19 లో గత టిడిపి పాలనలో వెలిగొండ ప్రాజెక్టుకు 1373 కోట్లు కేటాయించి,1319 కోట్లు అనగా 96శాతం ఖర్చు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. 2019-24 కాలంలో గత ప్రభుత్వం 3 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి కేవలం 170 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకనే పనులు అసంపూర్తిగా మిగిలిపోయి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే 2024 మార్చి 6న అప్పటి ముఖ్యమంత్రి జాతికి అంకితం చేయడం జరిగిందని మంత్రి అన్నారు. హెడ్ వర్క్స్ సంబంధించి మరియు వాల్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అలాగే 1.20 లక్షల క్యూ బిక్ మీటర్ల మట్టిని తొలగించాల్సి వుందని మంత్రి వివరించారు. గత ప్రభుత్వం హయాంలో 11 కిలో మీటర్ల లైనింగ్ పనులు 11 సంవత్సరాలు పట్టిందని, ఇంకా 6.8 కి మీ లైనింగ్ పనులు చేపట్టాల్సి వుందని మంత్రి తెలిపారు. వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేసేలా షెడ్యూల్ ను తయారు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందని మంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు పూర్తి కాకపోయినా, నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 880 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా , ఒక రూపాయు కూడా ఇవ్వకుండానే , ఎన్నికలముందు ఈ ప్రాంత ప్రజలను మభ్య పెట్టి గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు కు సంబంధించి 11 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయనీ, ఈ గ్రామాలకు సంబంధించి 7 పునరావాస కాలనీలను ఏర్పాటు చేయగా, 5 కాలనీల్లో మౌలిక వసతులు 2014-19 మధ్య కాలంలో కల్పించడమే జరిగిందని, గత ఐదు సంవత్సరాలుగా పునరావాస కాలనీల్లో ఎలాంటి పనులు చేపట్టలేదని మంత్రి వివరించారు. రెండో టన్నెల్ లో తవ్విన 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని మొదటి టన్నెల్ చివర భాగాన పోశారు.ఈ మట్టిని తొలగించకుండా నీరు వదలడం సాధ్యం కాదని మంత్రి అన్నారు. ఈ మట్టిని తొలగించాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందన్నారు. రెండు టన్నెల్స్ నుండి 11,500 క్యూసెక్కుల నీరు తరలించాల్సి ఉండగా,కనీసం 10క్యూసెక్కుల నీరు కూడా తీసుకెళ్ళలేని పరిస్దితి ఉంది.53 టిఎంసిల సామర్ద్యం ఉన్న నల్లమలసాగర్ లో కనీసం అర టిఎంసి నీరు కూడా నిల్వ చేయలేని పరిస్దితి ఉందని మంత్రి వివరించారు.ఫీడర్ కెనాల్స్ పరిస్థితి అధ్వాన స్దితిలో వున్నాయని, వీటిని పూర్తి స్థాయిలో పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్ట్స్ నిర్వహణకు సంబంధించి ప్రతి సంవత్సరం సుమారు 980 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వుండగా, గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు కలిపి కేవలం 225 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 2024 మార్చిలో ప్రాజెక్టుకు భూమిలిచ్చిన రైతులకు సైతం నోటీసులు ఇచ్చి సభకు రాకుండా అడ్డకుని పూర్తి కాకుండానే , 10 క్యూసెక్కులు కూడా రాని వెలిగొండ ప్రారంభోత్సవం అంటూ ప్రజలను మోసం చేశారని మంత్రి అన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ కు త్వరగా పూర్తి చేయుటకు ముఖ్యమంత్రి గారితో చర్చించి నవంబర్ మాసంలో పనుల షెడ్యూల్ ను తెల్పడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం ప్రాజెక్టు ల నిర్వహణ పై అలసత్వం వహించడంతో రాష్ట్రంలో ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్స్ నిర్వహణ సక్రమంగా లేకపోవడం వలన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకు పోవడం, పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్ట్స్ గేట్లు కొట్టుకుపోవడం జరిగిందని మంత్రి తెలిపారు. రాబోవు రోజుల్లో వెలుగొండ ప్రాజెక్ట్ ను త్వరగా పూర్తి చేయడంతో పాటు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు తాగునీరు అందించడం జరుగుతుంది మంత్రి తెలిపారు.
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ…ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రకాశం జిల్లాకు సాగునీరు, తాగునీరు అందించే లక్ష్యంతో వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణానికి అత్యంత ప్రాధన్యతను ఇచ్చి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఒంగోలు, మార్కాపురం, ఎస్ఎన్ పాడు, కనిగిరి, గిద్దలూరు, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, కందుల నారాయణరెడ్డి, బి.ఎన్. విజయకుమార్, డా . ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, ఇంటూరు నాగేశ్వర రావు, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. నూకసాని బాలాజీ, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, దర్శి, యర్రగొండపాలెం నియోజక వర్గ ఇంచార్జీ లు డా. గొట్టిపాటి లక్ష్మి, ఏరీక్షన్ బాబు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, సీఈ శ్యాంప్రసాద్, ఎస్ఈ అబూతలీం తదితరులు పాల్గొన్నారు.






