జిల్లాలో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన పనులను నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాల క్రిష్ణ, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో కలసి ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనుల పురోగతి, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార పురోగతి, వివిధ శాఖలకు సంబంధించిన కోర్టు కేసులు, పంచాయతీ రాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్ శాఖల ద్వారా చేపట్టిన పనుల పురోగతి మరియు గృహ నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయిలో రెవిన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమీషనర్లు, ఎంపిడిఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, ఏపీడీ, ఏపీవో, డీఈ, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో ఉపాధి హామీ పధకం ద్వారా చేపట్టిన సిసి రోడ్లు, సైడు కాలువలు నిర్మాణాలు, ఇంకుడు గుంతల నిర్మాణాలు, రూఫ్ టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, ఫారంపాండ్ నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాల మేరకు పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. పల్లె పండుగ కార్యక్రమం కింద చేపట్టిన పనులను 2024 డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తీ చేసేలా ఎంపిడిఓ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నిర్మాణాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యం మేరకు యూనిట్స్ ను గ్రౌండింగ్ చేసి పూర్తీ చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపిడిఓ లను ఆదేశించారు. అలాగే చేసిన పనులకు సంబందించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి, బాధ్యతతో వ్యవహరించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. దరఖాస్తుదారుడు కోరిన సమస్యకు అనుగుణంగా ఎండార్స్మెంట్ స్పీకింగ్ ఆర్డర్ కచ్చితంగా దరఖాస్తుదారులకు అందజేయాలన్నారు. అర్జీదారులను పదేపదే కార్యాలయం చుట్టూ తిప్పుకోకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని కలెక్టర్ అన్నారు. పరిష్కరించలేని సమస్యలను అర్జీలకు రాతపూర్వకంగా ఎండార్స్మెంట్ రూపంలో తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా రీ ఓపెన్ కేసులపై రెవెన్యూ డివిజనల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, డివిజనల్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి పెండింగ్ లో వున్న కోర్టు కేసులపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, జిల్లాలోని వివిధ శాఖలలో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించి పరిష్కారానికి ఎటువంటి జాప్యం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించి టైమ్బౌండ్ కేసులు, డైరెక్షన్స్, ధిక్కార, రిట్ ఫిటీషన్స్ లపై ఆయా శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. లోకాయుక్త కేసులపై జిల్లా అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు తో సమగ్రంగా కలెక్టర్ సమీక్షించారు. కేసుల పరిష్కారంపై సంబంధిత కేసులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు వాటర్ ట్యాంకుల క్లీనింగ్, వాటర్ టెస్టింగ్, క్లోరినేషన్ పై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్, ఆర్.డబ్ల్యూఎస్. అధికారులను ఆదేశించారు. సంబంధిత మండలంలో ఎంతమంది ప్రజలున్నారు. ఎంత తాగునీరు అవసరం వుందో అంచనా వేసి ప్రతి నెలా నివేదిక సమర్పించాలని సూచించారు. పారిశుధ్య ఏర్పాట్ల పై పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాను బాల్య వివాహాల రహిత ప్రకాశంగా తీర్చి దిద్దేందుకు ఈ నెల 14వ తేదీన అన్నీ స్కూల్స్, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మెగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మెగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు గాను ముందుగా మండల స్థాయిలో కో ఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్, అధికారులను ఆదేశించారు. సంబంధిత మండల ప్రత్యేక అధికారులు కూడా మండలంలో పర్యటించినప్పుడు సంబంధిత అంశాలపై సమీక్షించాలని కలెక్టర్, మండల ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
జిల్లాలో గృహ నిర్మాణ పనులు వేగవంతం చేసి రానున్న మార్చి నాటికి ఇంటి నిర్మాణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా జిల్లాలో 5771 ఇళ్ళ నిర్మాణాలు పూర్తీ చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇప్పటి వరకు 606 ఇళ్లు పూర్తీ కాగా మిగిలినవి వివిధ స్టేజ్ లలో వున్నాయని, వీటన్నింటిని డిసెంబర్ 20 తేదీ నాటికి పూర్తీ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ లోకేశ్వర రావు, డ్వామా పిడి జోసఫ్ కుమార్, సిపిఓ వేంకటేశ్వర రావు, డిపిఓ వెంకట నాయుడు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ సురేష్ కుమార్, జిల్లా ఉపాధి కల్పన అధికారి భరద్వాజ్, తదితరులు పాల్గొనగా, క్షేత్ర స్థాయి నుండి రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపి డి ఓ లు, తహసీల్దార్లు, సంబంధింత శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


