దర్శి టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వైద్య వృత్తిలో అత్యంత ప్రతిభ కనబరస్తూ నిరుపేదల పాలిట ప్రాణదాతగా నిలుస్తున్నారు. ముండ్లమూరు మండలంలోని తూర్పుకంభంపాడు పంచాయతీ పరిధిలోని భట్లపల్లి గ్రామానికి చెందిన ఫోటో గ్రాఫర్ తేలుకుట్ల వెంకట నారాయణ ఈనెల 7వ తేదీ స్నేహితులతో కలిసి అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నదిలో సరదాగా ఈతకు వెళ్లాడు. ఈత కొట్టే క్రమంలో సుడిగుండంలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. ఆయన ఫొటో గ్రాఫర్ జీవనాన్ని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి ఏడాది బాలుడు ఉన్నాడు. భార్య పద్మ పది నెలల గర్భంతో ఉంది. ప్రసవం కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా పుట్టెడు దుఃఖంతో తల్లడిల్లుతున్న ఆమె పాలిట దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దేవతలా ప్రత్యక్షమైంది. వెంకట నారాయణ మృతి వార్త తెలుసుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత సాగర్ దంపతులు పరామర్శించేందుకు ఆదివారం వెంకట నారాయణ ఇంటికి వెళ్లారు. మృతుడి భార్యను ఓదార్చి పైసా ఖర్చు లేకుండా శస్త్ర చికిత్స చేసి తల్లీబిడ్డను కాపాడతానని భరోసా ఇచ్చారు. ఆ మేరకు సోమవారం నరసరావు పేటలోని తన ఆస్పత్రిలో పద్మకు శస్త్ర చికిత్స చేసి పండింటి బిడ్డను ఆమె చేతిలో పెట్టారు. ఆపదలో ఉన్నవారు ఎవరైనా కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఏవైనా వైద్య సేవలు అవసరమైతే ఒక డాక్టర్గా స్పందిస్తానని గొట్టిపాటి లక్ష్మి తెలిపారు.

