వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు తావు లేకుండా గుంపులుగా గుమిగూడటాలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకోవాలని, ప్రవేశ మార్గము, నిష్క్రమణ ద్వారాల వద్ద బారికేడ్లు, వాహనా రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలని, పార్కింగ్ పాయింట్ల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, భక్తులు తొందరపడి గుంపులు గుంపులుగా దర్శనం కోసం తోపులాటలు చోటుచేసుకోకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాల వద్ద అలంకరణ కోసం కరెంటు వైర్లు వేలాడు విషయంలో దేవాదాయ అధికారులు నిరంతరం పరిశీలన ఉండాలన్నారు. దేవాదాయ, రెవిన్యూ, పోలీసు అధికారుల సమన్వయంతో దేవాలయ ప్రాంగణాలలో బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని, దేవాలయాల వద్ద దొంగతనాలు జరుగకుండా అనుమానిత వ్యక్తులపై కూడా నిఘా ఉంచాలని, ఎవరూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని స్పష్టంచేశారు. భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని, పోలీస్ వారికి సహకరించి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
