సురక్షితమైన ప్రయాణం, ప్రయాణీకుల భద్రత మా ప్రాధాన్యత – ఎన్ ఆర్ ఎస్ సి భద్రతా వారోత్సవాలలో ప్రసంగించిన మెట్రో ఎండీ శ్రీ ఎన్వీఎస్ రెడ్డి….

హైదరాబాద్ మార్చి 7(జె ఎస్ డి ఎం న్యూస్) : మెట్రో స్టేషన్లలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన భద్రత చర్యలు చేపట్టడం వల్ల ఇప్పటి వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలు, శాస్త్రీయమైన ఇంజినీరింగ్ విధానాలతో ముందుకు వెళ్లడం వల్ల హైదరాబాద్ మెట్రో రైల్ ను ప్రపంచ దేశాల సాంకేతిక పరిజ్ఞానానికి దీటుగా నిలపగలిగామని ఆయన వెల్లడించారు. బాలానగర్ లో ఉన్న నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సి) లో 54వ జాతీయ భద్రతా వారోత్సవాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థలో చేపడుతున్న భద్రతా చర్యలను వివరించారు. మెట్రో రైల్ నిర్మాణాన్ని కేవలం ఒక ఇంజినీరింగ్ కోణంలోనే కాకుండా, ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న సామజిక అంశంగా చేపట్టామని అయన తెలిపారు. పీపీపీ విధానంలో చేపట్టిన ప్రపంచంలోనే మొట్టమొదటిదైనా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎదురైనా అనేక క్లిష్టతరమైన సవాళ్ళను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ, ప్రజలకు ఒక గొప్ప రవాణా వ్యవస్థను అందించగలిగామని ఆయన చెప్పారు. భద్రత అంటే కేవలం నిబంధనలకు అనుగుణంగా ఉండటం మాత్రమే కాదు; ఒక బాధ్యత, నిబద్ధతలతో ఈ ప్రాజెక్ట్ ను మెరుగైన సాంకేతిక వ్యవస్థతో తీసుకురాగలిగామని చెప్పారు. ప్రాజెక్ట్ యొక్క ప్రతి దశలో, ప్రమాద విశ్లేషణ, ప్రమాద అంచనా వేయడం వల్ల డిజైన్ దశలోనే చాలా ప్రమాదాలు రాకుండా నివారించగలిగామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ మెట్రోలో నిర్మాణం సమయంలో కానీ, ఆ తర్వాత కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రమాదం కూడా జరగలేదని ఇది ఒక రికార్డని ఆయన వెల్లడించారు. అందువల్ల ప్రతిష్టాత్మకమైన స్కాట్లాండ్ లోని గ్లాస్గో నగరంలో అంతర్జాతీయంగా ఇచ్చే ‘రోస్పా గోల్డ్’ అవార్డులు వరుసగా మూడు సంవత్సరాలు పొందామని ఆయన తెలిపారు. మెట్రో రైలు ఆపరేషన్ భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు చేపడుతూనే, అధునాతమైన సిబీటీసీ టెక్నాలజీని మొదటి సారిగా తాము వినియోగించి, దేశంలోని మిగిలిన మెట్రో లకు ఆదర్శవంతంగా నిలవగలిగామని ఎన్వీఎస్ రెడ్డి వివరించారు. ఇస్రో కి అనుబంధంగా పనిచేస్తున్న ఎన్ఆర్ఎస్ సి భద్రతా చర్యలకు అధిక ప్రాధాన్యత ఇస్తూనే, కొత్త ఆవిష్కరణలతో దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ మాట్లాడుతూ భద్రతతో పాటు, ఉద్యోగులు, సిబ్బంది శ్రేయస్సును కూడా ఈ సారి భద్రతా వారోత్సవాలలో ఇతివృత్తంగా జోడించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. ఎన్ ఆర్ ఎస్ సి లో పని చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి భద్రత, వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. వికసిత భారత్ లక్ష్యానికి సంక్షేమం, భద్రత మూలాధారమని ఆయన అన్నారు. ఎన్ ఆర్ ఎస్ సి డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *