సమాజంలోని అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం నాడు శాసనసభలో ఎస్సి వర్గీకరణ అంశంపై మంత్రి మాట్లాడుతూ……ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ. దీనికోసం ఏక సభ్య కమిషన్ నియమించాం. ఈ కమిషన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 59 ఎస్సి కులాలను మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్ ప్రతిపాదించింది.
మెదటి గ్రూప్ లో రెల్లి మరియు అనుబంధ కులాలు, రెండవ గ్రూప్ లో మాదిగ మరియు అనుబంధ కులాలు, మూడవ గ్రూప్ లో మాల మరియు అనుబంధ కులాలుగా విభజించింది.
ఇందులో మొదటి గ్రూపుకు ఒక శాతం, రెండవ గ్రూప్ కు 6.5 శాతం, మూడవ గ్రూప్ కి 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ ప్రతిపాదించింది. జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని పలువురు సభ్యులు కోరారు. కొత్త జిల్లాల నేపథ్యంలో జనాభా లెక్కలు సరిగా లేనందున భవిష్యత్తులో జనాభా లెక్కలు జరిగిన తర్వాత జిల్లాల వారీగా వర్గీకరణ చేయాలని కమిషన్ సూచించిందని, సభ్యులందరూ ఈ ప్రతిపాదనను ఆమోదించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కోరారు.
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం అన్న ఎన్టీఆర్ పాటుపడ్డారని మంత్రి డోలా గుర్తు చేసారు. ఎస్సీ ఎస్టీలకు నాణ్యమైన విద్య అందించేందుకు ఎన్టీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారన్నారు. నాడు అంటరానితనం నిర్మూలించేందుకు జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి ఆ సిఫారసులు అమలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. నాడు టిడిపి ప్రభుత్వం రాజధానిలో 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించిన పనులు ప్రారంభించిందని, కానీ చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ దాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఎస్సీల ఇంటి నిర్మాణానికి అదనంగా కూటమి ప్రభుత్వం రూ.50 వేలు అందిస్తోందన్నారు. ఎస్సీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు టీడీపీ ప్రభుత్వంలో జరిగినవే తప్ప గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ ఎస్సిలకు చేసిందేమీలేదన్నారు. సబ్ ప్లాన్ నిధులను సైతం జగన్ దారి మళ్లించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చరిత్రలో ఎన్నడు లేని విధంగా రూ. 143 కోట్లతో హాస్టల్లలో మరమ్మతులు చేస్తున్నామని,తల్లిదండ్రులు లేని విద్యార్థుల కోసం వేసవికాలంలో అనురాగం పేరుతో హాస్టల్లోనే వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు.
విద్యార్థుల్లో అత్యవసర వైద్య సహాయం కోసం సాంత్వన పథకాన్ని తీసుకువస్తామన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రంలో కొత్తగా 30 ఎస్సి హాస్టళ్లు నిర్మిస్తున్నామని, వీటికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఎస్సి కార్పొరేషన్ కి రూ. 341 కోట్లు కేటాయించామని, దీని ద్వారా 20వేల మందికి లబ్ధి చేకూరుందని, లిడ్ క్యాప్ ద్వారా చర్మకారులను ప్రోత్సహిస్తామన్నారు. పి 4 తో ద్వారా ఎస్సీలకే మేలు జరుగుతుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు.

