వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన తప్పిదాలతోనే రాష్ట్రానికి కరెంట్ కష్టాలు వచ్చాయని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రకాశం జిల్లా, కనిగిరి గార్లపేట రోడ్డులో రూ. 3.80 కోట్లతో నిర్మించనున్న 33\11 కేవీ సబ్ స్టేషన్ కు మంత్రి డీబీవీ స్వామితో కలిసి సోమవారం మంత్రి గొట్టిపాటి శంకు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఇప్పటి వరకు 12 సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేశామన్నారు. ముఖ్యంగా రైతుల వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. ఇప్పటి వరకు 75 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రైతులకు ఇచ్చే ఒక్కో వ్యవసాయ కనెక్షన్ కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల వ్యయం చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు.
*సూర్యఘర్ పథకాన్ని మరింతగా వినియోగించుకోవాలి….*
పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఇళ్లపై సోలార్ ప్యానల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజలకు సూచించారు. విద్యుత్ ఛార్జీలు తగ్గడంతో పాటు వినియోగ భారం కూడా అదుపులో ఉంటుందని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోనూ 10 వేల సూర్య ఘర్ కనెక్షన్లు ఇచ్చే విధంగా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా బ్యాంకర్లతో మాట్లాడి ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రి కోరారు. అదే విధంగా పీఎం కుసుమ్ పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా వైసీపీ ప్రభుత్వం వినియోగించుకోకుండా వెనక్కి పంపిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే… తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలను పెంచి, ప్రజల నెత్తిన భారం వేశారని మండి పడ్డారు. అన్ని వ్యవస్థల్నీ సర్వనాశనం చేసిన వైసీపీ పెద్దలు కరెంట్ కష్టాలకు కారణమయ్యారని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత ఇప్పుడిప్పుడే అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా… కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం విద్యుత్ ఛార్జీలు పెంచే ఉద్దేశం లేదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
*అధిక లోడ్ తో ఇబ్బందులు లేకుండా…..*
రాష్ట్రంలోని ప్రజలందరికీ 24 గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని చర్యలూ చేపడుతున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా, దర్శి నియోజకవర్గం కురిచేడు మండలం కల్లూరు లో 33\11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ కు సోమవారం దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ తో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం దర్శిలో జరిగిన సుపరిపాలన – తొలి అడుగు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించిన మంత్రి.., సంక్షేమ పథకాల అమలు తీరును లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం.., గత సంవత్సరకాలంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక లోడ్ వల్ల వచ్చే లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కడికక్కడ సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థల్నీ నిర్వీర్యం చేసిన వైసీపీ నేతలు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బందుల పాలు చేశారన్నారు.




