హైదరాబాద్, ఆగస్టు 12, జే ఎస్ డి ఎం న్యూస్
తూర్పున ఫిలిప్పీన్స్ నుంచి పడమరలో టర్కీ వరకు వ్యాపించిన ప్రాంతంలో, తుల్సా-ప్రో అనే అత్యాధునిక పద్ధతితో స్థానిక ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలతో బాధపడుతున్న రోగులను విజయవంతంగా చికిత్స చేసిన తొలి ఆసుపత్రిగా కిమ్స్ హాస్పిటల్స్ చారిత్రాత్మక మైలురాయిని అందుకుంది.
ఈ చికిత్సను డే కేర్ విధానంలో నిర్వహించారు. ఇప్పటివరకు బహ్రెయిన్, దుబాయ్, మారిషస్‌లకు చెందిన ముగ్గురు విదేశీయులు సహా 13 మంది రోగులను విజయవంతంగా చికిత్స చేయడం ద్వారా, భారత వైద్య రంగంలో పెరుగుతున్న అంతర్జాతీయ ఖ్యాతి, వైద్య నైపుణ్య ప్రాముఖ్యతను కిమ్స్ ఆసుపత్రులు మరోసారి నిరూపించాయి.
ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ పెరుగుదల సమస్యలు ఇటీవలి కాలంలో పురుషుల్లో వేగంగా పెరుగుతున్నాయి. సాధారణంగా వీటి కోసం క్లిష్టమైన శస్త్రచికిత్సలు అవసరమవుతాయి. అయితే, ఒక ముఖ్యమైన పురోగతిగా కిమ్స్ ఆసుపత్రులు తుల్సా-ప్రో (ట్రాన్స్‌యూరేథ్రల్ అల్ట్రాసౌండ్ అబ్లేషన్ ప్రోస్టేట్) సిస్టమ్‌ను పరిచయం చేశాయి. ఇది విప్లవాత్మకమైన ఎంఆర్ఐ మార్గదర్శకత్వం కలిగిన అల్ట్రాసౌండ్ ఆధారిత చికిత్సా విధానం. ఈ చికిత్స ద్వారా ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేదు.ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆగ్నేయాసియాలో ఇదే మొట్టమొదటిగా నిలిచింది.
మంగళవారం కిమ్స్ ఆసుపత్రుల ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బొల్లినేని భాస్కర్ రావు ఈ అత్యాధునిక పరికరాన్ని ప్రారంభించారు. ఇటువంటి ప్రపంచ స్థాయి సాంకేతికతను భారతదేశానికి పరిచయం చేయడంలో తాము గర్వంగా భావిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ, “కిమ్స్‌లో మా రోగులకు ప్రపంచంలోని తాజా వైద్య విధానాలను చేరవేయడంలో కట్టుబడి ఉంది. తుల్సా-ప్రోతో, ఇప్పుడు మేము ప్రోస్టేట్ చికిత్సలో సంపూర్ణసేవలనుఅందిస్తున్నాం. ఇందులో సాంప్రదాయ శస్త్రచికిత్స, రేడియేషన్ థెరపీ, రోబోటిక్ విధానాలు, అలాగే ఇప్పుడు ఎటువంటి కోతలు అవసరం లేని చికిత్సలు ఒకే చోట లభిస్తాయి” అని తెలిపారు.అత్యంత ప్రమాద స్థితిలో ఉన్న రోగులకు అందించే వైద్య నైపుణ్యం, సేవల ప్రయోజనాలను కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు వివరించారు. “ఈ శస్త్రచికిత్స రహిత విధానం, గతంలో స్ట్రోక్, గుండె ఆపరేషన్లుచేయించుకున్నవారికి, థైరాయిడ్ సమస్యలు లేదా అరుదైన రక్త గ్రూపులు ఉన్న వారికి ప్రత్యేకప్రయోజనకరంగా ఉంటుంది. ఈ చికిత్సలో కీలకమైన మందులు ఆపాల్సిన అవసరం ఉండదు. రక్త మార్పిడి అవసరం లేకుండా ఉండడం వల్ల, మందుల పరస్పర ప్రభావాలు మరియు రక్త మార్పిడి సంబంధిత సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.”
అనంతరం కిమ్స్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యూరో-ఆంకాలజిస్ట్ & రోబోటిక్ సర్జన్ డాక్టర్ లిఖితేశ్వర్ పల్లగాని మాట్లాడుతూ తుల్సా-ప్రోను “లైంగిక సామర్థ్యాన్ని కాపాడే ఖచ్చితమైన ఎంఆర్ఐ మార్గదర్శక రోబోటిక్ విధానం. ప్రోస్టేట్ క్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగుల్లో ఇది తరచూ ముఖ్యమైన ఆందోళనగా కనిపిస్తుంది” అని వివరించారు. ఈ పరికరాన్ని మూత్రనాళం ద్వారా ప్రవేశపెట్టి, ప్రోస్టేట్ కణజాలాన్ని లోపల నుంచే తొలగిస్తారు. రోగులను అదే రోజు డిశ్చార్జ్ చేస్తారు.కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ & కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ వై.ఎం. ప్రషాంత్ మాట్లాడుతూ తుల్సా-ప్రో ప్రోస్టేట్ ఆకృతిని, పనితీరును కాపాడుతుందని, ఇది ముఖ్యంగా వృద్ధ రోగులకు, మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారికి, శస్త్రచికిత్సా ప్రమాదం ఎక్కువగా ఉండే వారికి అత్యంత అనుకూలమైన చికిత్స అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కిమ్స్ యూరాలజీ మరియు శస్త్రచికిత్స బృందంలోని ప్రముఖులు డాక్టర్ శ్రీకాంత్ మున్నా, డాక్టర్ కె.వి.ఆర్. ప్రసాద్, డాక్టర్ నీల్ నరేంద్ర త్రివేది తదితరులు హాజరయ్యారు.తుల్సా-ప్రోను పరిచయం చేయడంతో, కిమ్స్ ఆసుపత్రులు ప్రోస్టేట్ చికిత్సలో ఆసియా వ్యాప్తంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పాయి. ఇది సాంప్రదాయ శస్త్రచికిత్సకు సురక్షితమైన, ప్రభావవంతమైన, ప్రపంచ స్థాయి ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది.

