ఈ నిర్లక్ష్యం సరికాదు. ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది! ” – జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆగ్రహం – మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ

” మీ మండల, మున్సిపాలిటీల పరిధిలో ఏం జరుగుతోందో, అభివృద్ధి పనుల పురోగతి ఏ స్థాయిలో ఉందో కూడా మీకు అవగాహన లేదా ?…. మీటింగ్ కు పిలుస్తున్నప్పుడు కనీసం వాటికి సంబంధించిన సమాచారం కూడా లేకుండా ఎలా వస్తారు ?… ఈ నిర్లక్ష్యం సరికాదు. ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది! ” అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆగ్రహం
వ్యక్తం చేశారు. హౌసింగ్ , మెడికల్, పంచాయతీ, డ్వామా శాఖల ద్వారా చేపడుతున్న పనులు, సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలపై సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయా అంశాలపై కలెక్టర్ సమీక్షిస్తుండగా స్పష్టమైన సమాధానాలు చెప్పకుండా కొందరు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు తెల్లముఖం పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం తగిన సమాచారంతో కూడా ఎందుకు రాలేదని కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ” బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న మీరే ఇలా ఉంటే మీ కింది స్థాయిలో పనిచేసే సచివాలయ సిబ్బందిని ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో దీనిని బట్టే తెలుస్తోంద”ని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పద్ధతి, ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని తీవ్రంగా హెచ్చరించారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకములో ఇప్పటికీ 286 ఈ – కే.వై.సీ. పెండింగ్ ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనితోపాటు హౌస్ హోల్డ్ ఈ – కేవైసీ సర్వేను కూడా ప్రత్యేక డ్రైవ్ మోడులో చేపట్టాలని ఆదేశించారు. చదువుకున్న యువతకు వర్క్ ఫ్రం హోం కింద ఉపాధి కల్పించేలా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ కౌశలం ‘ సర్వేను కూడా పర్యవేక్షించాలని మున్సిపల్ కమిషనర్లు , ఎంపీడీవోలకు ఆమె దిశ నిర్దేశం చేశారు. ప్రతి సచివాలయానికి పాన్ కార్డు ఉండేలా దరఖాస్తు చేయాలన్నారు. సచివాలయ సిబ్బంది అందరూ కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు వేయాలని ఆమె ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ఈ విషయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కలెక్టర్ నిర్దేశించారు. ప్రతివారం కచ్చితంగా కనీసం మూడు సచివాలయాలను సందర్శించాలని వారిని ఆదేశించారు.
హౌసింగ్ స్కీములో ఇళ్ల నిర్మాణంలో ప్రతివారం స్పష్టమైన పురోగతి కనిపించాలని కలెక్టర్ పునరుద్ఘాటించారు. జన్మన్ ఇళ్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె చెప్పారు. ఎంపీడీవోలు, హౌసింగ్ ఏ.ఈ.లు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వర్షాలు పడుతున్నందున పారిశుద్ధ్యము, తాగునీటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండరాదన్నారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వలన వ్యాధులు ప్రబలితే సంబంధిత శాఖల మండల స్థాయి అధికారులపై కేసులు పెట్టడంతో పాటు జిల్లా స్థాయి అధికారుల పైనా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కలెక్టర్ చెప్పారు. ఏ.ఎన్.ఎం.లు రెగ్యులరుగా హాస్టళ్ళను తనిఖీ చేసి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. ఏమైనా అనుమానాస్పద పరిస్థితిని గమనిస్తే మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రతి 15 రోజులకు ఒకసారి తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలన్నారు. ఇంటి వద్ద నుంచే చెత్త సేకరణ పై ప్రభుత్వం ఐ.వి.ఆర్.ఎస్. ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నందున పారిశుద్ధ్యం విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. డ్వామా ఆధ్వర్యంలో జిల్లాలో చేపట్టిన నీటి సంరక్షణ పనులను ముఖ్యమంత్రి సైతం ప్రశంసించారని ఆమె చెప్పారు. పెండింగులో ఉన్న ఇంకుడు గుంతల పనులను 15 రోజుల్లోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ గొట్టిపాటి వెంకట నాయుడు, డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, డ్వామా పి.డి. జోసఫ్ కుమార్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *